మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం వాల్తేర్ వీరయ్య మాస్ జాతరని తలపిస్తూ నేడు శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. పూనకాలు లోడింగ్ అంటూ మెగా ఫాన్స్ ఊగిపోతున్నారు. చిరంజీవి కటౌట్స్, వాల్తేర్ వీరయ్య బ్యానర్ లతో మెగా ఫాన్స్ మాస్ థియేటర్స్ ఎదుట రచ్చ స్టార్ట్ చేసారు. భారీ అంచనాలతో భారీ ప్రమోషన్స్ తో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన వాల్తేర్ వీరయ్య పబ్లిక్ టాక్, ఓవర్సీస్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫస్ట్ హాఫ్ చూసిన ప్రేక్షకులు మెసేజ్ లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. తండ్రి చిరు వాల్తేర్ వీరయ్య సినిమా కోసం ఆయన కుమార్తెలు శ్రీజ, సుష్మిత తమ తమ పిల్లతో సహా వాల్తేర్ వీరయ్య బెన్ఫిట్ షో వేసిన థియేటర్ కి వెళ్లి సినిమాని ఎంజాయ్ చేసారు.
RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70MM థియేటర్ కి వెళ్ళిన సుశ్మిత, శ్రీజ, ఇంకా చిరు మనవళ్లు వాల్తేర్ వీరయ్యని అభిమానులతో కలిసి వీక్షించారు. తెల్లవారు ఝామున 4 గంటలకే వీరు మాస్ థియేటర్ కి వెళ్లి మరీ సినిమా చూసారు. వీరితో పాటుగా డైరెక్టర్ బాబీ, మరో డైరెక్టర్ మెహర్ రమేష్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా వాల్తేర్ వీరయ్యని వీక్షించిన వారిలో ఉన్నారు.
మెగా అభిమానుల మధ్యన తండ్రి సినిమా చూసేందుకు వచ్చిన శ్రీజ, సుశ్మితల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా సుశ్మిత తండ్రి వాల్తేర్ వీరయ్య సినిమాలో ఆయన కేరెక్టర్ కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.