జనరల్‌గా అందరూ రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ నడుస్తుందని చెబుతుంటారు.. కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా NBK సీజన్ నడుస్తుందని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై.. బాలయ్య కెరియర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని ‘వీరసింహుని విజయోత్సవం’ అనే వేడుకను ఆదివారం మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ డైరెక్టర్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అందులో బాలయ్యతో NBK 108 చిత్రం చేస్తున్న అనిల్ రావిపూడి కూడా ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపారు. బాలయ్యతో ఒక బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేసిన గోపీచంద్ మలినేనికి అభినందనలు తెలుపుతూ.. ఇక అన్‌స్టాపబుల్‌గా తన కెరీర్ ముందుకు సాగాలని కోరారు. ఇక బాలయ్యతో చేస్తున్న చిత్రం గురించి చెబుతూ.. ఇప్పటికే ఆయనతో ఒక షెడ్యూల్ పూర్తి చేశాను. ప్రతి సిట్టింగ్‌లో ఆయన ప్రేక్షకుల, అభిమానుల గురించి ఏ విధంగా ఆలోచిస్తారో చూసి ఆశ్చర్యపోయాను. అందుకే ప్రతి సినిమాకు ఆయన ఎన్‌బికె టచ్ యాడ్ చేస్తారు. ఆ టచ్‌తో ‘వీరసింహారెడ్డి’ వచ్చింది. అదే టచ్‌తో 108 రాబోతోంది.
కాకపోతే అన్న ఈసారి రాయలసీమలో కాదు.. తెలంగాణలో దిగుతుండు. బాక్సాఫీస్ ఊచకోత షురూ చేస్తడు. కలెక్షన్లతో కుర్బానీ పెడతడు. గెట్ రెడీ.. అంటూ అనిల్ రావిపూడి ఇచ్చిన స్పీచ్‌కు బాలయ్య ఫ్యాన్స్ కేకలతో హోరెత్తించారు. NBK 108 మాములుగా ఉండదనేలా ఆయన ఇచ్చిన స్పీచ్‌తో అప్పుడే భారీ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు మొదలవుతున్నాయి.