ఈటీవీలో తొమ్మిదేళ్లుగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఇప్పుడు వెల వెల బోతుంది. అక్కడ కామెడీ తక్కువై కాంట్రవర్సీ ఎక్కువైంది. కామెడీ చేసుకుంటూ జబర్దస్త్ లో పాపులర్ అయ్యి ఇతర ఛానల్స్ లోనే కాదు బిగ్ స్క్రీన్ మీద కూడా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఇప్పుడు జబర్దస్త్ పై కాంట్రవర్సీ కామెంట్స్ తో హైలెట్ అవుతున్నారు. కామెడీ షో అంటూ గొప్పగా చెప్పుకునే జబర్దస్త్ ని ఇప్పుడు నిజంగానే కామెడీ చేసేసారు. తమకి అన్నం పెట్టిన సంస్థనే తప్పుబడుతున్నారు. కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్ళు జబర్దస్త్ ప్రతిష్టని దిగజార్చారు. నాగబాబు, రోజా ఉన్నప్పుడు ఎంతో హుందాగా స్కిట్స్ చేసుకునే కమెడియన్స్.. ఇప్పుడు రోడ్డెక్కారు. సుధీర్, అభి లాంటివాళ్లు జబర్దస్త్ నుండి జంప్ అయ్యారు.
అయితే తాజాగా అదిరే అభి జబర్దస్త్ కి ఎవరిదో దిష్టి తగలబట్టే ఇలా తయారైంది అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టేజ్ మీద కామెడీ చేసే కమెడియన్లు అందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. మాది జబర్దస్త్ ఫ్యామిలీ అని అనేవారు. కానీ ఇప్పుడు వారే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ జబర్దస్త్ పరువు తీస్తున్నారంటూ అభి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అభి సోషల్ మీడియా వేదికగా.. మా జబర్దస్త్ కి బాగా దిష్టి తగిలింది, జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్ తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టిన కంటిస్టెంట్లు, అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం.
అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు, టైమ్ ఉండేది కాదు. కుశల ప్రశ్నలు, ఆపన్నహస్తాలు, జోకులు మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు. నాగబాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, యాంకర్స్ అనసూయ, రష్మీల అందం, స్కిట్ల మాయాజాలం. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలుతో జబర్దస్త్ కళకళలాడేది. కానీ ఇప్పుడు జబర్దస్త్ వెలవెలబోతుంది. అభి చెప్పినట్టే నాగబాబు, రోజా, అనసూయ, సుధీర్, అభి లాంటి వాళ్ళు వెళ్లిపోవడం, కామెడీ లేకపోవడం ఇవన్నీ జబర్దస్త్ ప్రతిష్ట దిగజారుస్తుంది.