విలక్షణ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం హీరో కన్నా ఎక్కువగా విలన్ రోల్స్ తో తెగ పాపులర్ అయ్యాడు. తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా ఇరగదీసిన విజయ్ సేతుపతి.. తమిళనాట రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ లో సంతానం పాత్రలో కత్తిలాంటి విలన్ గా అదరగోట్టేసాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ రాజ్ అండ్ DK వెబ్ సీరీస్ ఫార్జి లో రూత్ లెస్ పోలీస్ అధికారిగా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు.
అయితే విజయ్ సేతుపతికి సుప్రీం కోర్టు అక్షింతలు వెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కారణం.. ఆయన గతంలో బెంగుళూరు విమానాశ్రయంలో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. మహా గాంధీ అప్పట్లో విజయ్ సేతుపతి అతని పర్సనల్ సిబ్బంది తనపై దాడి చేసారంటూ కేసు పెట్టారు. అప్పటినుండి విజయ్ సేతుపతిని ఆ వివాదం వెంటాడుతుంది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. తాజాగా సుప్రీంకోర్టు విజయ్ సేతుపతికి చురకలు అంటించింది. ప్రముఖులు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. విజయ్ సేతుపతి ఒక సెలెబ్రిటీ.
సెలబ్రిటీ అన్న తర్వాత ప్రజల్లో ఉన్నప్పుడు తన ప్రవర్తన అదుపులో ఉండాలి. మీ నటనని, మిమ్మల్ని ఇష్టపడే చాలా మంది అభిమానులు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా కోర్టు విజయ్ సేతుపతి, మహా గాంధీ ఇద్దరికీ అంగీకారం అయితే చర్చల ద్వారా ఈ సమస్యని సెటిల్ చేసుకోవాలని సూచించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం అని కోర్టు చెప్పింది. దానిపై సమాధానం కోసం తదుపరి విచారణకి ఇరువురు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.