రామబాణంలో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. మహా శివరాత్రి కానుకగా శనివారం సాయంత్రం రామబాణం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. విక్కీస్ ఫస్ట్ యారో పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. కథానాయకుడిది రామబాణంలా దూసుకుపోయే స్వభావమని తెలిపేలా చేతికి బాణం లాకెట్ ధరించి అదిరిపోయే ఫైట్ తో గోపీచంద్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు సరైన యాక్షన్ సినిమా పడితే ఏ రేంజ్ లో చెలరేగిపోతారో కేవలం కొన్ని సెకన్ల వీడియోతోనే చూపించారు దర్శకుడు శ్రీవాస్. అలా అని ఇది పూర్తి యాక్షన్ ఫిల్మ్ కాదు.. తమ గత చిత్రాల తరహాలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని తెలిపేలా కొసమెరుపుతో ముగించారు.
చిన్నోడా అనే వాయిస్ రాగానే కథానాయకుడు సౌమ్యంగా అమృత నిలయంలోకి ప్రవేశించడం ఆకట్టుకుంది. వీడియోలో కథానాయకుడి పాత్రలో చూపించిన వ్యత్యాసానికి తగ్గట్లుగా మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం మెప్పించింది.
లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత గోపీచంద్, శ్రీవాస్ లు కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ కావడంతో చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ రెండు సినిమాలను మించేలా ఉండాలని శ్రీవాస్ ప్రత్యేక శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.