టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమతా మోహన్ దాస్ తర్వాత నాగార్జున, వెంకటేష్ సినిమాల ద్వారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో.. తన మాతృ భాషలో సినిమాలు చేస్తూనే కొన్నాళ్ళు ఎవరికీ కనిపించలేదు. కారణం ఆమె క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వద్దామనుకున్న తరుణంలో మరోసారి క్యాన్సర్ తిరగబెట్టడంతో చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో మమతా మోహన్ దాస్ మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యింది.
అయితే తాజాగా మమతా మోహన్ దాస్ తనకి మరో వ్యాధి సోకినట్లుగా చెప్పడమే కాదు.. దానివలన తాను ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ.. ఒంటరి తనని భరించలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నట్లుగా చెప్పి షాకిచ్చింది. తనకి విటిలిగో అనే అరుదైన వ్యాధి సోకినట్టుగా చెప్పింది. దాని వలన నరకయాతన అనుభవించాను, క్యాన్సర్ వచ్చినప్పుడు స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో కోలుకున్నాను, కానీ విటిలిగో వచ్చాక ఒంటరితనం భరించలేకపోయాను.
విటిలిగో ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడినప్పుడు తెలియకుండానే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదానిని. ఎప్పుడూ కెమరా ముందు పని చేసుకునే నేను ఆ ఒంటరితనాన్ని భరించలేకపోయాను, ఇప్పటికి నా చేతుల మీద మచ్చలుంటాయి. అవి ఏమిటని అడిగినవారికి నా ఇన్స్టా చూడండి తెలుస్తుంది అని చెబుతాను అంటూ మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చింది.