ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడం కోసం ఎస్.ఎస్. రాజమౌళి అండ్ టీమ్ సుమారుగా రూ.85 కోట్లకు పైగా ఖర్చు చేశారనేలా ఇటీవల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా.. ఆ ఖర్చు పెట్టిన అమౌంట్‌తో 10 సినిమాలు తీసేవాళ్లమంటూ.. కాస్త హేళనగా మాట్లాడారు. కానీ ఆస్కార్ క్యాంపెయిన్‌కి అయిన ఖర్చు గురించి తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ విపులంగా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఆస్కార్ క్యాంపెయిన్‌కి అయిన ఖర్చు రూ. 85 కోట్లు కాదు.. జస్ట్ రూ. 8.5 కోట్లు మాత్రమే. అది కూడా స్పెషల్ షోలు ఎక్కువగా వేయడం కారణంగా అంత అయిందంటూ ఆయన చెప్పుకొచ్చారు.
కార్తికేయ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ థియేటర్లలో చూడాల్సిన సినిమా. ఆ స్టాండర్డ్స్‌లోనే రూపొందించాం. మొదట సినిమా విడుదలైనప్పుడు విదేశీయుల నుంచి సినిమాకు చాలా మంచి స్పందన వచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకుని ఆమెరికన్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్ వెర్షన్ విడుదల చేయాలనుకున్నాం. అన్నీ రెడీ చేశాం కూడా. జూన్ 1న రిలీజ్ అనుకుంటున్న సమయానికి మే 25కి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో నెల ఆలస్యంగా సినిమాను విడుదల చేశాం. నాన్ ఇండియన్స్ ఈ సినిమాని ఆదరించడమే కాకుండా.. ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్ అంటూ ట్రెండ్ మొదలెట్టారు. అప్పుడే మాకు కూడా ఆస్కార్ ఆలోచన వచ్చింది. ఇండియా నుంచి అధికారికంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు ఆస్కార్ ఎంట్రీ లభించక పోవడంతో చాలా బాధగా అనిపించింది. అందువల్ల ఆస్కార్ కోసం సొంతంగా అప్లయ్ చేయాలని నిర్ణయించుకున్నాం.
హాలీవుడ్ సినిమాలకు అయితే బిగ్ స్టూడియోస్ పబ్లిసిటీ ఖర్చంతా చూసుకుంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అంత ఖర్చు చేసే స్టూడియో లేదు. మాములుగా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం మేము మొదట అనుకున్న బడ్జెట్ రూ.5 కోట్లు. దాన్ని మూడు దశల్లో ఖర్చు చేయాలనుకున్నాం. మొదటి దశలో రూ.3 కోట్లు. నామినేషన్స్ వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తం క్యాంపెయిన్‌ను ఐదారు కోట్లలో పూర్తి చేయాలనుకున్నాం. చివరకు రూ.8.5 కోట్లు అయింది. న్యూయార్క్, లాస్ ఏంజెలెస్ వంటి చోట్ల మరిన్ని స్క్రీనింగ్స్ వేయాల్సి రావడంతో మేము అనుకున్న బడ్జెట్ పెరిగింది. ఈ క్యాంపెయిన్‌కు మూడు పీఆర్ టీమ్స్ పని చేశాయి. అకాడమీ వోటర్స్‌కు సినిమాపై ఆసక్తి పెంచడంలో వీరు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే.. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ సాధ్యమైందని.. చెప్పుకొచ్చారు.