పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ల కాంబినేషన్‌లో సముద్రఖని రూపొందిస్తోన్న చిత్రం ‘బ్రో’. ఈ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే మిగిలివున్న పాట క్లబ్ సాంగ్.. అదే మన భాషలో ఐటమ్ సాంగ్ అని తెలుస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా సత్తా చాటి, ప్రస్తుతం సౌత్‌లో అవకాశాలే లేని రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ సాంగ్‌లో ఆడే అవకాశం వచ్చినట్లుగా టాక్ వినబడిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆమెని కాదని.. మేకర్స్ మరో పాపకి ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ పాప మరెవరో కాదు..?
మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘బాస్ పార్టీ’లో దుమ్మురేపిన ఊర్వశి రౌతేలా. ‘బ్రో’ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ పబ్ సెట్‌ని రెడీ చేశారు. తీరా సాంగ్ చిత్రీకరణ సమయానికి రకుల్ ప్రీత్ హ్యాండ్ ఇవ్వడంతో.. మరోవైపు పవన్ కల్యాణ్ పొలిటికల్‌గా బిజీ అవుతుండటంతో.. మేకర్స్ ఊర్వశిని లైన్‌లోకి తీసుకొచ్చినట్లుగా తాజా సమాచారం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ డేట్స్ దొరకడం ఎంత కష్టమో తెలియని విషయం కాదు. అందుకే.. డేట్స్ లేవని చెప్పిన రకుల్‌ని సాగనంపి.. ఊర్వశికి ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికి రకుల్ ప్రీత్ సింగ్ ఈ పాటలో చేస్తుందని అనగానే.. మెగా ఫ్యాన్స్ అందరూ నిరుత్సాహాన్ని కనబరిచారు. ఎందుకంటే మెగా హీరోలకు ఆమె లెగ్ అలాంటిది మరి.
ఇక రకుల్ సంగతి పక్కనెట్టి.. ఊర్వశి విషయానికి వస్తే.. ఈ పాప ఈ సంవత్సరం ఇప్పటికే రెండు ఐటమ్ సాంగ్స్‌లో మెరిసింది. ఇప్పుడు ‘బ్రో’లో చేస్తే హ్యాట్రిక్ అవుతుంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ‘ఏజెంట్’ చిత్రంలోనూ ఊర్వశి తన టాలెంట్ ప్రదర్శించింది. ఈసారి మెగా ద్వయంతో ఆడి పాడే ఛాన్స్‌ను సొంతం చేసుకుంది. కాగా.. పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించనున్న ఈ ‘బ్రో’ చిత్రం కోలీవుడ్‌లో సముద్రఖని తెరకెక్కించి, నటించిన ‘వినోదయ్య సిత్తం’కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ మేనమామ-మేనల్లుడు కాంబినేషన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.