మాస్ మహారాజా రవితేజ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి మరో మెగాస్టార్ ఆయన. ఎందుకు మరో మెగాస్టార్ అని ఆయనని పిలుస్తారో కూడా అందరికీ తెలిసిన విషయమే. మెగాస్టార్ చిరంజీవిలానే ఆయన కూడా కష్టపడి పైకి వచ్చారు. అంతేకాదు, మెగాస్టార్ అమితంగా ఇష్టపడే హీరోలలో రవితేజ కూడా ఒకరు. రీసెంట్‌గా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, 2000లో వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలలో వీరిద్దరూ అన్నదమ్ములుగా కూడా నటించారు. ఇక ‘ధమాకా’ ముందు వరకు వరుస ఫ్లాప్స్‌ని చవిచూసిన రవితేజ.. ఆ తర్వాత మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరో ఎవరంటే ఆయన పేరే వినిపిస్తోంది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌లో ఆయన మరో సినిమాను అనౌన్స్ చేశారు.
రవితేజతో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన గోపీచంద్ మలినేని.. మరోసారి ఈ మాస్‌రాజాని డైరెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్‌గా బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో రవితేజతో సినిమాకు సిద్ధమవుతున్నారు. #RT4GMగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చీరాల సమీపంలోని ‘చుండూరు’ నేపథ్యంలో తెరకెక్కనుందనేది తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. చుండూరు అనగానే ముందుగా గుర్తొచ్చేది 1991లో జరిగిన దళితుల ఊచకోత. పోస్టర్ చూస్తుంటే.. దాదాపు ఈ నేపథ్యంలోనే సినిమా ఉండబోతుందనేది తెలుస్తోంది. ఇంతకు ముందు గోపీచంద్, రవితేజల కాంబినేషన్‌లో వచ్చి, బ్లాక్‌బస్టర్ కొట్టిన ‘క్రాక్’ సినిమా కూడా చీరాల సమీపంలోని ఒంగోలు, వేటపాలెం నేపథ్యంలోనే సాగింది. ఇప్పుడు గోపీచంద్ కన్ను చుండూరుపై పడింది. గోపీచంద్ మలినేనిది ఒంగోలు కావడంతో.. ఆయన తను పుట్టిన ఊరు చుట్టు పక్కల జరిగిన విషయాలతో పవర్‌ఫుల్ కథలని సిద్ధం చేస్తున్నాడని అనుకోవచ్చు.
అయితే ఈ రెండే కాకుండా.. వంశీ దర్శకత్వంలో ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కూడా చీరాల సమీపంలోని ‘స్టూవర్టుపురం’ నేపథ్యంలోదే కావడం విశేషం. మొత్తంగా చూస్తే.. మాస్ రాజా రవితేజ చీరాలను చుట్టేస్తూ.. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో జరిగిన కథలతో.. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇది కావాలని జరుగుతుందో.. లేదంటే యాదృచ్చికమో తెలియదు కానీ.. చీరాల పరిసరాలతో రవితేజ బాగా కనెక్ట్ అవుతున్నాడనేలా.. #RT4GM ప్రకటన వచ్చిన తర్వాత వార్తలు వైరల్ అవుతున్నాయి.