ఓరేయ్ నేను సరదాగా అన్నానురా.. అంటే నేను సీరియస్‌గా తీసుకున్నాలే.. అని ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్‌ల మధ్య జల్సా సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు అల్లు అరవింద్ కూడా కాజువల్‌గా అన్న మాటని.. క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి సీరియస్‌గా తీసుకుని.. మెగా హీరోని లైన్‌లో పెట్టిందట. ఈ విషయం మరోసారి సరదాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. రీసెంట్‌గా ఆయన ‘బేబీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో హీరోయిన్‌ని ఉద్దేశిస్తూ మాట్లాడేటప్పుడు.. గతంలో ఓ హీరోయిన్ విషయంలో ఇలాగే జరిగిందని చెప్పి.. అందరినీ నవ్వించారు.
‘బేబీ’ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుతూ.. ఆ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్ ఉంది. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకోవద్దు. కెరీర్‌లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకో. ఇలాగే నా బ్యానర్‌లో మూడు సినిమాలకు పనిచేసిన ఓ హీరోయిన్ విషయంలో ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వమని అంటే.. ఆ హీరోయిన్ మా వాడినే లవ్ చేసేసింది.. అంటూ లావణ్య త్రిపాఠి పేరు చెప్పకుండా అల్లు అరవింద్ సరదాగా కామెంట్స్ చేశారు. అల్లు అరవింద్ అలా అనడంతో.. వైష్ణవి కూడా ముసిముసిగా నవ్వుకుంది.
ఇక ఇవ్వాళ థియేటర్లలోకి వచ్చిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ చెప్పినట్లే.. ఈ సినిమాలో వైష్ణవి నటనకి అంతా ఫిదా అవుతున్నారు. ఆమెకు మంచి భవిష్యత్ ఉంది, మంచి నటిగా కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండిపోతుందని సినిమా చూసిన వారంతా అంటున్నారు. మొత్తానికి అల్లు అరవింద్ మరో హీరోయిన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయన్నమాట.