సినిమాల విషయంలో ఏమో కానీ.. ఈమధ్యన కార్ పార్కింగ్ వ్యవహాంలో ట్రాఫిక్ డీసీపీతో కయ్యానికి కాలు దువ్వి కోర్టు మెట్లెక్కిన హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ మహా నగరంలో కొద్దిపాటి వర్షానికే ప్రజలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని అరగంటలో గమ్యస్థానానికి చేరవలసిన వారు గంటల తరబడి రోడ్ల మీద ఉండిపోయే పరిస్థితి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో గత మూడు రోజులుగా వర్షం ధారాపాతంగా కురుస్తూ ఉండగా.. రోడ్లన్నీ జలమయం అవడం అటుంచి రోడ్లన్నీ వాహనాలమయంతో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్.. ట్రాఫిక్ జామ్.
అలా నిన్న రాత్రి హైదరాబాద్ వర్షంలో బయటికెళ్లిన హీరోయిన్ డింపుల్ హయతి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయింది. హైదరాబాద్ కి తలమానికంగా పిలవబడుతున్న కేబుల్ బ్రిడ్జ్ పై గంటల తరబడి ట్రాఫిల్ లో చిక్కుకున్న డింపుల్ KTR ని, సీఎంవో ని ట్యాగ్ చేస్తూ.. ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేసింది. ఇంటికి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. ఎమర్జెన్సీ అయితే పరిస్థితి ఏంటీ.. ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ.. హైదరాబాద్ లో అసలు కాలు బయట పెట్టగలమా.. ప్రభుత్వ ప్రతినిధులారా మాకు పెట్రోల్ ఉచితంగా రావడం లేదు.. అంటూ ట్వీట్ చేసింది.
అయితే ప్రతి ఒక్కరూ ఈ ట్రాఫిక్ జామ్ ని ఫేస్ చేసిన వారే. కానీ డింపుల్ మాత్రం గతంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ వ్యవహారంతో రగిలిపోయి ఉండడంతోనే ఇప్పుడు ఈ ట్రాఫిక్ గురించి ఇలా మాట్లాడుతుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. సినిమాలు లేక ఏదోలా హైలెట్ అయ్యేందుకు డింపుల్ తాపత్రయ పడుతుంది అందుకే ఇలా ట్వీట్ చేసింది అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.