మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం దర్శకుడు, నటుడు, రచయిత అయిన సముద్రఖని పూజలు చేస్తున్నాడట. ఏంటి.. ఆయనతో సినిమా చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడని అనుకుంటారేమో? ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరి బాండింగ్ చాలా బాగుంటుంది కాబట్టి.. అలా అనుకునే అవకాశాలైతే లేకపోలేదు. ఇప్పటికే సముద్రఖని ఇద్దరు మెగా హీరోలను డైరెక్ట్ చేసి ఉండటంతో.. గ్యారంటీగా విషయం అదే అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం మాత్రం మూవీ అవకాశం కాదు. సముద్రఖని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సొంత బాబాయ్ పవన్ కళ్యాణ్‌గారిని పిలిచినట్టే నన్ను కూడా అంతే ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడు చరణ్. నేను కూడా సొంత బిడ్డగా భావిస్తాను. ఆర్ఆర్ఆర్ సినిమాతో మా ఇద్దరి మధ్య బాండింగ్ అలా ఏర్పడింది. నేనంటే చాలా ఇష్టపడతాడు. ఆర్ఆర్ఆర్ సెట్స్‌లోగానీ, ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్ సెట్స్‌లోగానీ నన్ను ఎంతో ప్రత్యేకంగా చూస్తాడు. రామ్ చరణ్ మనసు చాలా మంచిది.. మనిషిగా చాలా ఉన్నతమైన మనస్థత్వం అతనిది. అలాంటి మంచి మనిషి.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాను. ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా చరణ్‌కు సన్నిహితంగా ఉండే పాత్రే. అందులోని నా పాత్రని అందరూ ఎంతో ఇష్టపడతారు. ఆర్ఆర్ఆర్ టైమ్‌లో చరణ్ ఫ్యాన్స్ కూడా నన్ను సొంత బాబాయ్ అన్నట్లుగా ఫీలయ్యారు. గేమ్ ఛేంజర్‌తో ఆ బంధం ఇంకాస్త పెరుగుతుందని అనుకుంటున్నాను.. అని సముద్రఖని చెప్పుకొచ్చారు.
ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బ్రో’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. మేనమామ, మేనల్లుడిని డైరెక్ట్ చేసి.. ఏ డైరెక్టర్‌కూ దక్కని గౌరవాన్ని సముద్రఖని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ శుక్రవారం విడుదలైన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోవడంతో.. ఈ వీకెండ్ కూడా బ్రోకి బాగా కలిసివచ్చింది. మెగా హీరో సాయితేజ్‌తో త్వరలోనే సముద్రఖని మరో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.