గ్లోబల్ స్టార్ అనేది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు. ఇక్కడున్న హీరోలందరినీ తట్టుకుని, వాళ్లందరినీ నెట్టుకుని, చిరంజీవిగారి కొడుకుగా పేరు నిలబెట్టుకుని.. ఎంత ఎదిగినా చేతులు కట్టుకుని ఉన్నాడు కాబట్టే.. రామ్ చరణ్ ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యాడని అన్నారు కమెడియన్ హైపర్ ఆది. భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకను వేదికగా చేసుకుని మెగా ఫ్యామిలీపై ట్రోల్ చేసే వారందరికీ హైపర్ ఆది క్లాస్ ఇచ్చేశాడు. మళ్లీ మాట్లాడాలంటే భయపడేంతగా ఆది ఇచ్చిన క్లాస్‌లో.. రామ్ చరణ్ గురించి కామెంట్స్ చేసే వాళ్లకి ఏ విధంగా క్లాస్ ఇచ్చాడంటే..
* ఇంకొందరు శాడిస్ట్‌లు ఉంటారు. చిరంజీవిగారి తనయుడు రామ్ చరణ్ తేజ్.. చిరుత సినిమాతో అరంగేట్రం చేసినప్పుడు కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ తర్వాత ఏదైనా సినిమా హిట్టయితే.. అది డైరెక్టర్ వల్ల.. ఫ్లాప్ అయితే రామ్ చరణ్ గారి వల్ల అంటూ కామెంట్స్ చేశారు. అప్పుడొచ్చింది ‘రంగస్థలం’ అనే ఒక సినిమా. నోరెత్తిన ప్రతి ఒక్కడూ.. చెయ్యెత్తి జై కొట్టాడు. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కడూ కామ్‌గా చూస్తుండిపోయారు. నేను ఇప్పుడూ కూడా చెబుతున్నా.. సచిన టెండూల్కర్ కొడుకు సచిన్ అవ్వలేదు. అమితాబచ్చన్ కొడుకు అమితాబచ్చన్ అవలేదు. కానీ చిరంజీవిగారి కొడుకు మాత్రం చిరంజీవి అయ్యాడు.
కొణిదెల వెంకట్రావుగారికి కొణిదెల చిరంజీవిగారు ఎంత పేరు తెచ్చారో.. కొణిదెల చిరంజీవిగారికి కొణిదెల రామ్ చరణ్‌గారు అంతకంటే ఎక్కువ పేరే తెచ్చారు. మెగాస్టార్, పవర్‌స్టార్ ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మెగా పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నాడని అనుకోవచ్చు. కానీ గ్లోబల్ స్టార్ అనేది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు. ఇక్కడున్న హీరోలందరినీ తట్టుకుని, వాళ్లందరినీ నెట్టుకుని, చిరంజీవిగారి కొడుకుగా పేరు నిలబెట్టుకుని.. ఎంత ఎదిగినా చేతులు కట్టుకుని ఉన్నాడు కాబట్టే ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్ తేజ్‌గారు.