Advertisementt

‘భోళా శంకర్’పై కేసు.. రిలీజ్ కష్టమేనా?

Sat 12th Aug 2023 04:47 PM
distributor satish,bholaa shankar,anil sunkara,agent,vizag  ‘భోళా శంకర్’పై కేసు.. రిలీజ్ కష్టమేనా?
Distributor Satish Filed Case on Bholaa Shankar Producer ‘భోళా శంకర్’పై కేసు.. రిలీజ్ కష్టమేనా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఇంకొన్ని గంటలలో రిలీజ్ ఉందనగా.. ఇప్పుడీ సినిమా చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వానికి చిన్న సలహా ఇచ్చిన పాపానికి.. చిరుని వైసీపీ నాయకులు, అభిమానులు తిట్టిపోస్తున్నారు. సినిమాని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్యాగ్‌ని వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘భోళా’కు మరో చిక్కు వచ్చి పడింది. ‘భోళా శంకర్’ సినిమాను నిర్మించిన ఎ.కె. ఎంటర్‌టైన్మెంట్స్ అధినేతలు, నిర్మాతలైన అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్) ఆరోపణలు గుప్పిస్తూ.. సినిమా విడుదలపై కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు బుధవారం తనకు జరిగిన అన్యాయంపై ఆయన ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. అందులో.. 

‘‘ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ నన్ను మోసం చేయడంతో వారి నిజ స్వరూపం బట్టబయలు అయింది. వారు చేసిన అన్యాయం ఏమిటో ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్ ఆఖరులో విడుదలైన ‘ఏజెంట్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్‌కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి.. 30 కోట్ల రూపాయలు తీసుకుని మరీ వారు నన్ను పచ్చిగా మోసగించారు. బ్యాంకు అకౌంట్ రూపంలో నా సహచర వ్యాపార మిత్రుల సహకారంతో 30 కోట్ల రూపాయల వైట్ మనీని ‘ఏజెంట్’ సినిమా మూడు రాష్ట్రాల హక్కుల కోసం నేను చెల్లించినట్లు పక్కాగా ఆధారాలు ఉన్నప్పటికీ, వారు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేసి, అగ్రిమెంట్‌కు తూట్లు పొడిచారు. ఆ తర్వాత మే 1వ తేదీన హైదరాబాద్‌లోని వారి ఆఫీస్‌కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్‌ను కలవడం జరిగింది. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు ఎదురయ్యాయి. సినిమా డిజాస్టర్ ప్లాప్ అయ్యిందని చెప్పి, మరుసటి రోజు అనగా మే 2వ తేదీన మళ్ళీ ఆఫీసుకు వస్తే, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని నాకు చెప్పారు. ఆ మేరకు నాకు అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత వారు చేసిన ‘సామజవరగమన’ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు ఇచ్చారు. ఆ చిత్రం ద్వారా కేవలం చాలా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది.

ఈనేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఒప్పంద పత్రం చేశారు. అయితే వారి తదుపరి సినిమా ‘భోళా శంకర్’ అయ్యింది. అయితే కొద్ది రోజులుగా వారు నాకు సమాధానం ఇవ్వడం మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా ఈ విషయం చెప్పి, సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడం కోసం తప్పనిసరి పరిస్థితులలో కోర్టుకు వెళ్లడం జరిగింది. విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్‌గా సినీ పరిశ్రమతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థలం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి  వంటి అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. అలాగే ఎ.కె. ఎంటర్‌టైన్మెంట్స్ పైన వారు నిర్మించిన, అలాగే ఇతర బ్యానర్స్ పైన భాగస్వాములతో కలసి వారు తీసిన అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. గతంలో ఎప్పుడూ డబ్బు గురించిన సమస్యలు కానీ, మోసాలు కానీ తలెత్తలేదు. అయితే ఇప్పుడు ఎ.కె. ఎంటర్‌టైన్మెంట్స్ వారు నా దగ్గర 30 కోట్లు తీసుకుని, సరిగ్గా సమాధానం చెప్పకుండా, ఎగ్గొట్టాలనే తలంపుతో ఆఖరికి నా మీద ఫోర్జరీ చేశాననే నింద కూడా వేశారు. వాస్తవానికి ఆ మధ్య యూరోస్ ఇంటర్నేషనల్ వారికి వీరు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో వీరిపై ఆ సంస్థ కేసులు కూడా పెట్టింది. అలాగే ఎంతోమందిని మోసం చేస్తూ, వీరు తమ గుడ్ విల్‌ను పోగొట్టుకున్నారు.. ఇంకా ఎంతోమందికి వీరు బాకీలు ఉన్నారు. 

నా నీతి, నిజాయితీ ఏమిటో సినీ పరిశ్రమతో పాటు అందరికీ తెలుసు. అయితే తెలియని వారికోసమే తప్పనిసరి పరిస్థితులలో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నాకు న్యాయం జరగాలని ఆశిస్తూ అడ్వకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. మరోవైపు క్రిమినల్ కేసు కూడా వారిపై ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఫైనాన్సియర్స్ అందరి పైన ఈడీకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. వారు నటించిన సినిమా అన్న ఉద్దేశ్యంతోనే నేను ఆచితూచి, ఇంతవరకు ఎక్కడా మీడియాకు ఎక్కకుండా ముందుకు సాగాను. అయితే నా మీద ఎప్పుడైతే ఫోర్జరీ నింద వేసి, ఆ వార్తలను గ్రూపులలో తిప్పిస్తూ, నన్ను అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారో.. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజాయితీ, న్యాయం గెలుస్తాయని నేను నమ్ముతున్నాను. బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడుతాం. వాస్తవాలను మీడియా ముందు ఉంచుతాం’’ అని డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Distributor Satish Filed Case on Bholaa Shankar Producer :

Bholaa Shankar Movie in Controversy Case Filed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ