పాపం బండి సంజయ్ కష్టం పగొడికి కూడా రావొద్దు..! బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థితికి బీజేపీని తీసుకెళ్లి.. ఇప్పుడు టికెట్ ఇచ్చే రేంజ్ నుంచి ప్లీజ్.. ప్లీజ్ అని అడుక్కునే పరిస్థితికి ఆయన చేరుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి ప్రస్తుత పరిస్థితులు కూడా ఇలాగే అనిపిస్తున్నాయి. పులిలా బీఆర్ఎస్‌పై గాండ్రించిన బండి.. ఇప్పుడు కనీసం పిల్లిలా కూడా కూతలు పెట్టడం లేదు. ఆయన నుంచి బీజేపీ రాష్ట్ర పగ్గాలు లాగేయడంతో మౌనమునిలా మారిపోయారు. ఫైర్ బ్రాండ్.. డైనమిక్ మాస్ లీడర్ కాస్త సైలెంట్ అయిపోయారు. కేవలం నాయకత్వం ఇచ్చిన బాధ్యతలను ఏదో ఫార్మాలిటీ ప్రకారం చేస్తూ ముందుకు వెళుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన బండి ప్రస్తుతం ఆ ఆశలను సైతం విరమించుకున్నారట.
కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేయరని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి కూడా లోక్‌సభ బరిలోకి దిగుతారని టాక్. తెలంగాణలో బీజేపీ పరిస్థితి గతంలో మాదిరిగా లేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పటికీ బండి సంజయ్ చేతిలోనే రాష్ట్ర పగ్గాలు ఉండి ఉంటే సీన్ ఎలా ఉండేదో కానీ ఇప్పడు అసలు తెలంగాణలో బీజపీ ఉందా? అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక బండి సంజయ్ విషయానికి వస్తే.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయనలో మునుపటి జోష్ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వారికే కాదు.. సామాన్యులకు సైతం ఈ విషయం స్పష్టంగా అవగతమవుతోంది. గతంలో కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఎలాగైనా గెలవాలనే కసితో నియోజకవర్గాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ అనే ఐదు భాగాలుగా విభజించి ఎన్నికల ప్రణాళికను బండి సంజయ్ సిద్ధం చేసుకున్నారట.
ఈసారి అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బండి సంజయ్ ఉన్న తరుణంలో అనూహ్యంగా బీజేపీ పెద్దలు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి షాక్ ఇచ్చారు. సంజయ్ చాలా బాధపడ్డారని తెలిసింది. తన నుంచి పగ్గాలు లాగేయడానికి ముందు కూడా బండి సంజయ్.. రాష్ట్ర అధ్యక్షుడిగా హస్తిన నుంచి తిరిగి వస్తానో లేదోనని చాలా మనోవేదనకు గురయ్యారట. బండి సైలెంట్ అయిపోవడంతో ఇదే సరైన సమయమని.. ఆయనకు పట్టున్న స్థానాల్లోనూ పోటీ చేసేందుకు పార్టీకి చెందిన ఇతర నేతలు సిద్ధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డిని కలిసి పైరవీలు కూడా మొదలు పెట్టారట. ఒకవేళ కరీంనగర్ అసెంబ్లీని బండి వద్దనుకుంటే తనకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ అడుగుతున్నారట. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి సంతోష్ వచ్చారు కాబట్టి ఆయనకు కిషన్‌రెడ్డి ప్రాధాన్యతనిస్తారని కూడా టాక్ నడుస్తోంది. మరోవైపు బండి నుంచి పగ్గాలు లాగేశాక కీలక నేతలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డీ అంతా ఏమైపోయారో కూడా తెలియడం లేదు. వీరంతా త్వరలోనే పార్టీ మారుతారన్న టాక్ కూడా నడుస్తోంది.