తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుని మంచి జోష్‌లో పరుగులు తీస్తోంది. ఇప్పటి వరకూ తమలో తాము కొట్లాడుకున్న కాంగ్రెస్ నేతలంతా ఒక తాటిపైకి వచ్చి అధికారపక్షంతో పోరుకు సిద్ధమయ్యారు. పార్టీ అధిష్టానం కూడా తెలంగాణకు రాబోతోంది. తెలంగాణలో యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతోంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఇక ముందు ఎలా వ్యవహరించాలనే విషయమై పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల జాబితా సిద్ధమవుతోంది. నేడో రేపో ఈ అభ్యర్థుల జాబితా విడుదలవుతుంది. ఏకకాలంలో నియోజకవర్గాలపై నేతలంతా అటాక్ చేయనున్నారు. ఒక్కసారిగా ఎన్నికల ప్రచారంలో నేతలంతా పాల్గొననున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇంత జోష్ నడుస్తున్న సమయంలో ఓ కీలక నేత మాత్రం ఎప్పటి మాదిరిగానే అలిగి బుంగ మూతి పెట్టుకుని కూర్చొన్నారు. సమావేశాలు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ గైర్హాజరవుతున్నారు. అయినా ఎవరూ దేఖరే. దీంతో బుంగ మూతి కాస్తా.. మరింత చిన్నబోయింది. ఆ నేత మరెవరో కాదు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏదైనా ఒకసారి అలిగితే ఓకే.. రెండు సార్లు అలిగితే ఓకే.. పదే పదే అలిగితే.. ఆయనెప్పుడూ అంతేలే.. అని వదిలేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎలాంటి పార్టీ సమావేశాలకు రాకున్నా కూడా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు భట్టి విక్రమార్క స్పందించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ థాక్రేను కోమటిరెడ్డి నివాసానికి తీసుకెళ్లి ఆయనను బుజ్జగించారని ప్రచారం జరుగుతోంది.
తొలుత రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విభేదిస్తూ కోమటిరెడ్డి కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధిష్టానం కాస్త బుజ్జగించడంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఆ తరువాత సీట్ల కేటాయింపు విషయంలో అలకబూనారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ జాబితాల్లో పేరు లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇక థాక్రే అయితే కోమటిరెడ్డి నివాసం నుంచే కేసీ వేణు గోపాల్‌కు ఫోన్ చేయించి మంచి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇప్పించారని ప్రచారం జరుగుతోంది. అసలు మాటిమాటికీ ఇలా అలిగి కూర్చోవడమేంటని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం సిన్సియర్‌గా పని చేస్తే హైకమాండ్ తప్పక గుర్తిస్తుందని.. అది మానేసి మాటిమాటికీ ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి అలకలకు ఆది అంతం కనిపించడమే లేదు.