మాస్ మహారాజా రవితేజ సెప్టెంబర్ 15కి ఫిక్సయ్యాడు. అంటే.. ఆయన హీరోగా చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారని అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రీపోన్ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి కాబట్టి.. రవితేజ ఫిక్సయ్యాడు అనగానే.. ఇప్పుడంతా ఆ సినిమానే ముందుకు వచ్చేస్తుందని అనుకుంటారు. కానీ రవితేజ చిత్రమే కానీ.. టైగర్ నాగేశ్వరరావు సినిమా కాదు. రవితేజ యాక్ట్ చేసిన చిత్రం కాదు.. రవితేజ ప్రొడ్యూస్ చేసిన చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది.
సెప్టెంబర్ 15న ముందు ఓ మూడు నాలుగు చిత్రాలను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అనూహ్యంగా అన్ని సినిమాలు సెప్టెంబర్ 28కి వాయిదా పడ్డాయి. దీంతో ఆ డేట్‌ని విడుదలకి ఒక్క విశాల్ చిత్రం మాత్రమే ఉంది. ఇక ఇదే ఛాన్స్ అనుకున్న రవితేజ.. తన నిర్మాణ సంస్థ అయిన ఆర్‌టి టీమ్‌వర్క్స్‌లో రూపుదిద్దుకున్న ఛాంగురే బంగారురాజా చిత్రాన్ని హడావుడిగా లైన్‌లోకి తెచ్చేశాడు. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి మాస్ రాజా నిర్మించారు.
ఈ సినిమాని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అంతే కాదు.. ఈ నాలుగు రోజుల పాటు ప్రమోషన్స్‌ని వీర లెవల్‌లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అలా డేట్ అనౌన్స్ చేశారో లేదో.. వెంటనే ట్రైలర్ లాంచ్ అంటూ ఓ గ్రాండ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రవితేజ గెస్ట్‌గా రాబోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి అంతా వద్దనుకున్న డేట్‌ని, పండగని రవితేజ ఇలా వాడేసుకుంటున్నాడని ఇండస్ట్రీలో అంతా మాట్లాడుకుంటుండటం విశేషం.