భోళాశంకర్ ఓటీటీ ఆగమనానికి సమయం ఆసన్నమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళాశంకర్. ఆగస్ట్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌కి గురైంది. అయితే థియేటర్లలో ఈ సినిమాని చూడని ప్రేక్షకులంతా.. ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఆశలో ఉన్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ ఏమిటంటే.. భోళా శంకర్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధం చేస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అదే డేట్ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్.. మెగాస్టార్ సోదరిగా నటించింది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించారు. థియేటర్స్‌లో ఫెయిలైన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.
భోళాశంకర్ కథ విషయానికి వస్తే.. చెల్లెలు మహాలక్ష్మి (కీర్తీ సురేష్)ని కలకత్తాలో ఆర్ట్స్ కాలేజ్ లో చేర్చేందుకు శంకర్ (చిరంజీవి) హైదరాబాద్ నుండి కలకత్తా షిఫ్ట్ అవుతాడు. చెల్లెలిని కాలేజ్‌లో జాయిన్ చేసి కలకత్తాలో క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరతాడు. మహాలక్ష్మిని చూసి మొదటి చూపులోనే మనసు పారేసుకుంటాడు శ్రీకర్(సుశాంత్). మహాలక్ష్మి పెళ్లి ఏర్పాట్లలో ఉన్న సమయంలోనే కలకత్తాలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. అనుమానితుల ఫోటోలను ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చి.. వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వమని పోలీసులు చెబుతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో కొంత మంది అమ్మాయిలను పోలీసులు రక్షిస్తారు. మహిళల అక్రమ రవాణా చేసే అలెక్స్ (తరుణ్ అరోరా) మనుషులకు పోలీస్‌లకి శంకర్ సమాచారం ఇచ్చాడని తెలుసుకుని శంకర్‌ని ఆయన చెల్లి మహాలక్ష్మిని టార్గెట్ చేస్తారు. హైదరాబాద్ సిటీలో భోళా భాయ్ అని అందరూ పిలిచే వ్యక్తి, కలకత్తాలో శంకర్ అవతారం ఎందుకు ఎత్తాడు అనేది భోళా శంకర్ పూర్తి కథ.