జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వస్తా అని మాటిచ్చినట్లే.. మంగళగిరి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమో?. కారణాలు చెప్పడం లేదు.. రాకూడదు అంటున్నారు.. అని పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి మీడియాతో మాట్లాడుతున్న మాటలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనను ఏపీ రానీయకుండా చేయాలని జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. ఆపలేకపోయారు. నిన్న చంద్రబాబు అరెస్ట్ కంటే కూడా.. రాత్రి పవన్ కళ్యాణ్ ఏపీ జర్నీనే హాట్ టాపిక్ అవడం విశేషం.
ఆకాశ మార్గాన రావాల్సిన వాడిని అడ్డుకున్నారు. అలా అని కారులో వెళుతుంటే లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ కథలు చెప్పారు. కారు దిగి నడిచి వెళుతుంటే.. కాదు కూడదంటూ అడ్డుపడితే ఆగడానికి ఆయనేం సాదా సీదా మనిషి కాదు.. మహా శక్తి. ఆ శక్తి గొప్పతనం ఏమిటో రాత్రి ఒక్కొక్కరికీ తెలిసి ఉంటుంది. అదుపుచేయాలని చూసిన పోలీసుల వల్ల కూడా కాలేదు ఆయనని ఆపడం. పవర్‌ని పట్టుకుంటే ఏమవుతుందో.. రాత్రి పవన్ కళ్యాణ్‌ని ఆపాలని చూసిన వారికి కూడా అలాంటి షాకే తగిలింది. చంద్రబాబుని అరెస్ట్ చేశామనే ఆనందంలో ఉన్న వైసీపీ నాయకులకు నిద్రలేని రాత్రిని చూపించాడు పవర్ స్టార్.
అంతేకాదు, చంద్రబాబు అరెస్ట్‌తో ఏం సాధించారో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్‌ని ఏపీ రాకుండా నిర్భందించాలని చూసి వారి గొయ్యి వారే తవ్వుకున్నారు. అసలాయన చంద్రబాబు అరెస్ట్‌తో సంబంధం లేకుండా.. తన పార్టీ మీటింగ్ వ్యవహారాల నిమిత్తం ఏపీ వస్తుంటే.. పోలీసులు ఎంత ఓవరాక్షన్ చేయాలో అంత చేశారు.. పరువు పోగొట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీ వారే కామ్‌గా ఉంటే.. ఆయనని వెళ్లి కలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్‌కి ఏముంటుంది? ఈ లాజిక్‌ని ఎలా మిస్సయ్యారో? ఆకాశమార్గాన వెళతున్న వాడిని ఆపకుండా ఉంటే.. ఏ గోలా ఉండేది కాదు. ఏపీలో ఏది లేదో.. అదే సమస్య అని చెప్పి పవర్‌ని ఆపాలని చూసి.. పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ వాళ్లు ఎంత భయపడుతున్నారో.. ప్రజలకి ప్రత్యక్షంగా తెలిపే ప్రయత్నం చేశారు. అయినా.. భయపడి వెనక్కి పారిపోవడానికి ఆయనేం క్రిమినల్ కాదు.. నిఖార్సైన ప్రజా నాయకుడు, ప్రజల మనిషి. అర్థమైందా రాజా..