టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి నాలుగు రోజులు దాటుతోంది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. కానీ ఆ పార్టీ తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విషయంపై స్పందిస్తున్నారు. నిజానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పురందేశ్వరి మినహా బీజేపీ నేతలంతా సైడ్ అయిపోయారు. ఒక్క పురందేశ్వరి మినహా పెద్దగా ఎవరూ స్పందించలేదు. అన్ని పార్టీలూ స్పందిస్తున్నా మిన్నకుండి పోయారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నిన్న స్పందించారు. కాగా.. నేడు తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు.
తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కనీసం ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలి కానీ ఈ పనులేంటని నిలదీశారు. వైసీపీ తన గోతిలో తనే పడిందన్నారు. కక్షపూరితంగా అరెస్టు చేశారని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఆంధ్రాలో వైసీపీకి ఈ దరిద్రపు అలవాటు ఉందని బండి సంజయ్ అన్నారు. నిజం మాట్లాడితే చంద్రబాబు ఏజెంట్ అంటారు. వైసీపీ నేతలేమైనా సుద్ద పూసలా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు వైసీపీకి చాలా మైనస్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను అన్ని పార్టీలు వ్యతిరేకించాయని బండి సంజయ్ పేర్కొన్నారు.
మొత్తానికి చంద్రబాబు అరెస్ట్‌తో బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయనకు మైలేజ్ రావడం.. ఇండియా కూటమి నేతలు సైతం అరెస్ట్‌పై స్పందించడం.. అరెస్ట్‌ను ఖండించడం వంటి అంశాలు బీజేపీకి షాక్ కలిగించినట్టున్నా్యి. కనీసం జీ 20 అయిన వెంటనే బీజేపీ అగ్ర నేతలు స్పందించినా కాస్త విలువ ఉండేది. అప్పుడు స్పందించకుంటే ఇప్పుడు స్పందించినా ఉపయోగం ఉండదు. డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగానే ఇలా తెలుగు రాష్ట్రాల నేతలతో చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడిస్తు్న్నారని ప్రచారం జరుగుతోంది. లేదంటే అధిష్టానం అనుమతి లేకుండా బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించడమనేది జరగదని అందరికీ తెలిసిందే.