తెలంగాణ బీజేపీలో వస్తున్నది టీ కప్పులో తుఫాన్ అయితే లైట్ తీసుకోవచ్చు. కానీ సునామీ వస్తోంది. లైట్ తీసుకుంటే అంతే సంగతులు. టోటల్ కొలాప్స్. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు? గల్లీ లీడర్ల నుంచి కీలక నేతల వరకూ పార్టీ మారేందుకు మొగ్గు చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికలతో బీజేపీ తెలంగాణలో భూస్థాపితమేనన్న వాదన లేకపోలేదు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ ఒక్కసారిగా కెరటంలా ఎగిసింది. ఆ తరువాత కర్ణాటక ఎన్నికలు తెలంగాణలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ తరువాత బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు పార్టీకి ఊహించని నష్టం తెచ్చిపెట్టాయి.
అంబర్‌పేట్ బీజేపీ సీనియర్ నాయకులు, గ్రేటర్ మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి అవమానాలను భరించలేక పార్టీని వీడుతున్నట్టు మీడియాకు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది కేవలం వెంకటరెడ్డికే పరిమితం కాలేదు. ముఖ్య నేతల్లోనూ ఇదే నిర్వేదం. జాతీయ నాయకత్వం వైఖరిపై సీనియర్ల అసంతృప్తి.. రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహార శైలి.. ఇతర పార్టీల నుంచి చేరికలపై ప్రహసనం.. ఈటల వైఖరి.. బలం ఉన్న నాయకుల సస్పెన్షన్.. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టుగా బీజేపీ నేతల్లోనూ నైరాశ్యానికి వంద కారణాలున్నయి. అసలు ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు లోపాలను సరి చేసుకుని.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టడం వంటివి చేస్తుంది. కానీ బీజేపీ తెలంగాణలో రివర్స్‌గా వ్యవహరిస్తోంది. ఇటీవల చికోటి ప్రవీణ్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ వంటి వారికి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేర్చుకునే సమయానికి నేతలంతా గాయబ్ అయ్యారు.
అంతేకాదు.. కొందరి సస్పెన్షన్ కూడా పార్టీ కార్యకర్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. జిట్టా బాలకృష్ణారెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన యెన్నెం శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్ వ్యవహారం.. ఆపై వారు విమర్శిస్తున్న కీలక నేతలు కామ్ అయిపోవడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు విజయశాంతి సైతం తాను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని అభిమానిస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారని టాక్ ప్రారంభమైంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రవీంద్ర నాయక్, ఏనుగు రవీందర్‌రెడ్డి వంటి వారు రహస్య సమావేశమవుతున్నారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. త్వరలోనే తెలంగాణ బీజేపీలో కేవలం 5-6 కీలక నేతలు మినహా ఎవరూ ఉండేలా కనిపించడం లేదు.