ఇప్పటి వరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. ఇది సముచితం కాదు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. మరికొందరు నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు.
నేను సిక్కు బిడ్డను. మాకు త్యాగాలు తెలుసు, పోరాటాలు తెలుసు. దయచేసి నన్ను మీ రాజకీయాల కోసం లాగొద్దు. ప్రస్తుతం నేను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నాను. గత రెండు సంవత్సరాలుగా వారి కోసం జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత గారితో కలిసి దేశవ్యాప్త పర్యటన చేస్తున్నాను. ఇప్పటికే 15 రాష్ట్రాలు, 21 రాజకీయ పార్టీలకు సంబంధించిన 100కు పైగా పార్లమెంటు సభ్యులను కలిసి వారి మద్దతు తీసుకున్నాము.
ఈ ప్రయాణంలో అనేక మంది సామాజిక ఉద్యమకారులను కలిశాము. మహిళా ఉద్యమ నేతలతో చర్చించాము. మహిళా హక్కుల కోసం నిరంతరం నేను గళం విప్పుతూనే ఉంటాను. నా వైపు నుండి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తాను. దయచేసి దీనిని గమనించగలరని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు,
పూనమ్ కౌర్
సామాజిక కార్యకర్త.