ప్రపంచ ధనవంతులలోనే అతి ముఖ్యమైన వ్యాపారవేత్త, భారతదేశంలో అత్యంత వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం అనగానే గుర్తొచ్చే పేరు గౌతం అదాని. అయితే తాజాగా ఆయన.. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో రహస్య భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. అధికారికంగా అదానీ రాష్ట్రానికి వచ్చి వెళ్లుంటే ఏదో వ్యాపార పనుల నిమిత్తం అనుకునేవారు కానీ అత్యంత రహస్యంగా వచ్చారు. ఆయన ప్రైవేజ్ జెట్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగీ దిగగానే రాచ మర్యాదలు లభించాయి. ప్రత్యేక పోలీస్ ఎస్కార్టు ఆయనను వెంట తీసుకుని వెళ్లి ఫైవ్ స్టార్ హోటల్‌లో దిగబెట్టింది. అక్కడ ఆయన కాస్త ఫ్రెష్ అవగానే.. ఏపీ సీఎం జగన్ నివాసానికి తీసుకెళ్లింది.
తాడేపల్లిలోని జగన్ నివాసంలో జగన్ దంపతులతో అదానీ రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఆ రెండు గంటలూ వారి మధ్య ఏం చర్చకు వచ్చాయి? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. జగన్ దంపతులతో మీటింగ్ అనంతరం అదానీ సీక్రెట్‌గా వెళ్లిపోయారు. సీక్రెట్.. సీక్రెట్‌గానే ఉండి ఉంటే ఎవరూ పట్టించుకునే వారు కానీ బట్టబయలవడంతో ఏపీలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టుతో పాటు సౌర, వాయు, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఇప్పటికే అదానీ కైవసం చేసుకున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో గృహాల్లో స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగించే కాంట్రాక్ట్ కూడా ఆదానీ కంపెనీ చేజిక్కించుకుంది. కానీ ఇలా చాలా మంది వ్యాపారవేత్తలు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇది సహజం. కానీ ఎవరితోనూ జగన్ ఇంత సీక్రెట్‌గా సమావేశమైంది లేదే.
పైగా అదానీకి అదనపు క్వాలిటీ మరొకటి ఉంది. ప్రధాని మోదీకి అదానీ అత్యంత సన్నిహితులు. గుజరాత్‌లో ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య గట్టి సంబంధమే ఉందనేది అందరికీ తెలుసు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా అదానీ ఆయనకు అన్ని వేళలా అండగా నిలిచారు. ఇక మోదీ ప్రధాని అయ్యాక అదానీతో బంధం మరింత బలపడింది. ఈ క్రమంలోనే అదానీ ఆస్తులు అంతింతై వటుడింతయై అన్నట్టుగా ఓ రేంజ్‌కి పెరిగిపోయాయి. ఈ విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదానీపై ఎన్ని వివాదాలు, ఆరోపణలు వచ్చినా కూడా మోదీ ప్రభుత్వం నోరు మెదిపిందే లేదు. మరి అలాంటి అదానీకి జగన్‌తో పనేంటి? వీరిద్దరి భేటీ వెనుక ఉన్నది మోదీయేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే రహస్య మంతనాల అంతరార్థం బయటకు వస్తుందని విపక్షాలు అంటున్నాయి.