కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల తన పార్టీ వైఎస్సార్‌టీపీని విలీనం చేస్తారా? లేదంటే ఒంటరిగానే ముందుకు వెళతారా? గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న హాట్ టాపిక్ ఇదే. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో వివిధ దఫాలుగా షర్మిల సమావేశం అవుతున్నా కూడా ఈ విషయంలో స్పష్టత మాత్రం రావడం లేదు. ఈ తరువణంలో విలీనం ఉంటుందని ఒకసారి.. లేదు వైఎస్సార్‌టీపీ ఒంటరి పోరుకే సిద్ధమవుతుందని మరోసారి వార్తలు వినవస్తున్నాయి. తాజాగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆమె ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారని తెులస్తోంది. ఈ పర్యటనతో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే షర్మిల విలీన అంశానికి సంబంధించి డెడ్‌లైన్ అయితే విధించుకున్నారు. సెప్టెంబరు 30తో ఏదో ఒక విషయం తేల్చేయాలని భావించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యూహకర్త సునీల్ కనుగోలుత చివరిసారిగా రాయబారం నడిపారు. ఈ రాయబారం ఫలించింది. షర్మిలకు హస్తిన నుంచి ఆహ్వానం అయితే అందింది. ముఖ్యంగా విలీనానికి బ్రేకులు పడటానికి కారణం షర్మిల కొన్ని విషయాల్లో పట్టుదలగా వ్యవహరించడమేనని తెలుస్తోంది. తన పొలిటిక్స్ కేవలం తెలంగాణకే పరిమితమని.. తాను ఏపీ పొలిటిక్స్‌లో జోక్యం చేసుకోబోనని తేల్చి చెబుతున్నారట. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమె సేవలను ఏపీ ఎన్నికల్లో వినియోగించుకోవాలని భావిస్తోందట.
ఇక పోతే ఆమె తెలంగాణలో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించాలని కోరుతున్నారని కానీ అక్కడి టికెట్ మాజీ ఎంపీ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిక్స్ అయ్యిందట. ఇక ఖమ్మం వచ్చేసి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫిక్స్ అయ్యిందట. దీంతో ఖమ్మం జిల్లాలో ఏ స్థానాన్ని షర్మిలకు కేటాయించే అవకాశం లేదట. ఇది కూడా అడ్డంకిగా మారిందని టాక్. పైగా షర్మిల ఏపీకి చెందిన వారు కావడంతో బీఆర్ఎస్ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడితే అసలుకే ఎసరొస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. మొత్తానికి రెండు రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం, షర్మిలతో భేటీలో అన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.