వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఒక్కో హీరోది ఒక్కో ప్రత్యేకత, గొప్పదనం ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా నటించి ఖ్యాతి పొందారు ఎన్టీఆర్. సామాజిక చిత్రాల్లో ఏఎన్నార్ ఒక దిగ్గజం కాగా అత్యధిక సినిమాల్లో నటించి తెలుగు తెరకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది. ఫెరోషియస్ పాత్రలకు కృష్ణంరాజు మకుటం లేని మహారాజైతే... బాక్సాఫీస్ అంకెలకు పరుగులు నేర్పింది మెగాస్టార్ చిరంజీవి. ఇలా.. దిగ్గజాల స్ఫూర్తిని, లెగసీని కొనసాగిస్తూ టాలీవుడ్‌ను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. నేడు (అక్టోబర్ 23) ఈ పాన్ ఇండియా స్టార్, ఇండియన్ సినిమాకు ఛత్రపతి అయిన ప్రభాస్ పుట్టినరోజు.
హీరోలందరి ఫ్యాన్స్ ఇష్టపడే హీరో
పవన్ కల్యాణ్ మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి కొత్త స్టార్స్ తెలుగు తెరపై ఎమర్జ్ అవుతున్న సమయంలోనే ఈశ్వర్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు ప్రభాస్. పరిచయం వరకే వారసత్వం.. ఆ తర్వాత నిలబెట్టేది సత్తానే అని చాటాడు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో పరిచయం అయిన ప్రభాస్.. తన పెర్ఫార్మెన్స్‌తో అప్పుడే ఫ్యూచర్ స్టార్ అని అనిపించుకున్నాడు. మొదటి సినిమాతోనే ప్రభాస్ హీరోయిజానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సపోర్ట్ లభించింది. అక్కడి నుంచి వైవిధ్యమైన చిత్రాలతో.. అన్ని ఎమోషన్స్ పలికిస్తూ.. నటనతో పాటు డ్యాన్స్‌లు, ఫైట్స్, అందానికి తగిన హైట్, ప్రవర్తన.. ఇలా అన్నీ కలగలసి అందరూ హీరోల ఫ్యాన్స్ తనని అభిమానించే రేంజ్‌కి చేరుకున్నారు.
హిట్స్‌తో సంబంధంలేని స్టార్‌డమ్
ఈశ్వర్‌తో పరిచయమైన ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ హిట్స్‌తో సంబంధంలేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా.. ఆయన స్టార్‌డమ్ మాత్రం పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. వర్షం ప్రభాస్‌కు తొలిసారి బిగ్ కమర్షియల్ సూపర్ హిట్ ఇవ్వగా.. రాజమౌళి కాంబినేషన్‌లో చేసిన ఛత్రపతి మాస్ హీరోగా తిరుగులేని స్టార్‌డమ్ అందించింది. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీస్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ప్రభాస్ మరింత దగ్గరయ్యారు. రాఘవేంద్ర, అడవిరాముడు, చక్రం, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్, రెబల్...వంటి సినిమాలన్నీ నటుడిగా ప్రభాస్ వెర్సటాలిటీ చూపిస్తే.. మిర్చి ఆయన కెరీర్‌లో ఓ మెమరబుల్ సక్సెస్‌గా నిలిచింది. బాహుబలి సిరీస్ చిత్రాలు.. రికార్డ్ స్థాయి విజయాలతో ప్రభాస్ గ్లోబల్ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రభాస్ రేంజే మారిపోయింది.
ఆ ఘనత ప్రభాస్‌దే..
ఇవాళ రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ వంటి వారు గ్లోబల్ రేంజ్‌లో పేరు సంపాదించుకుంటున్నారంటే.. ఆ ఘనతలో ప్రభాస్ పాత్ర ఎంతో ఉంది. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ మార్కెట్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా ప్రభాస్‌కే దక్కుతుంది. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని రికార్డులెన్నో ప్రభాస్ తిరగరాశారు. తెలుగు సినిమాకు 2000 కోట్ల కలెక్షన్స్ సాధించే సత్తా ఉందని బాహుబలి -2తో ప్రభాస్ నిరూపించాడు. ఓవర్‌సీస్ మార్కెట్‌లో పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి హీరో ప్రభాస్. బాహుబలి రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఇక ఓన్లీ తెలుగు సినిమా చేసే స్థాయి దాటిపోయింది. ప్రభాస్ ఇమేజ్ కూడా టాలీవుడ్‌కే పరిమితం చేయలేనంతగా మారిపోయింది. అందుకు తగినట్లే భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు ప్రభాస్. ఇప్పుడొస్తున్న ప్రతి సినిమాను పాన్ ఇండియా అంటున్నారంటే.. అందుకు కారణం ప్రభాసే అని ఏ తెలుగు మూవీ ప్రేక్షకుడిని అడిగినా చెప్పేస్తాడు.
అందులోనూ ప్రభాస్‌దే పై చేయి
ప్రభాస్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి విదేశాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమానుల్లో యువతతో పాటు సకుటుంబ ప్రేక్షకులు ఉన్నారు. ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్ట్యాచ్యూ కలిగిన తొలి సౌత్ స్టార్ ప్రభాసే కావడం విశేషం. సొసైటీకి తన అవసరం కలిగిన ప్రతిసారీ మనసున్న గొప్ప స్టార్‌గా ప్రూవ్ చేసుకుంటారు ప్రభాస్. ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్‌లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్‌కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. విరాళాలు ఇవ్వడంలో ప్రభాస్ ది పెద్ద చేయి. మిగతా స్టార్స్ కంటే పెద్ద మొత్తంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వాలకు అందిస్తుంటారు డార్లింగ్. సమాజం పట్ల, తన ప్రేక్షకుల పట్ల ప్రభాస్‌కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయర్స్ సంపాదించుకుంటున్న తొలి సౌత్ హీరోగా కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. ఆయన వ్యక్తిత్వం నోబుల్... ఇమేజ్ గ్లోబల్... స్టార్‌డమ్ అన్ మ్యాచబుల్.
యూనివర్సల్ డార్లింగ్
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాల లైనప్ చూస్తుంటే.. ఒక్కొక్కరికీ మతిపోవాల్సిందే. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి 2898ఏడీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. భారీ బడ్జెట్‌తో, ప్రపంచస్థాయి టెక్నాలజీతో కల్కి 2898 ఏడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. టాలీవుడ్ హిస్టరీలో కల్కి 2898 ఏడీ సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమనేలా ఇప్పటికే టాక్ నడుస్తోంది. శాన్ డియాగో కామిక్ కాన్‌లో రిలీజ్ చేసిన కల్కి 2898 గ్లింప్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఒక స్పెషల్ మూవీ కానుంది. ప్రభాస్‌ను కొత్త జానర్‌లో, సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు దర్శకుడు మారుతి. టి సిరీస్ నిర్మాణంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించే స్పిరిట్ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలతోనే కాకుండా, ఆయన చేసే ప్రతి సినిమా ఘన విజయం సాధించి.. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచాలని కోరుకుంటూ.. అలాగే అంతా ఎదురు చూస్తున్న ఆయన పెళ్లి కూడా త్వరగా జరగాలని కోరుకుంటూ.. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది సినీజోష్. హ్యాపీ బర్త్‌డే డార్లింగ్..