గత కొన్ని సందర్భాల్లో రవితేజ బాలకృష్ణపై పై చెయ్యి సాధించాడు. ఈసారి కూడా ఇదే రిపీట్ అవుతుంది అని కొన్ని మీడియా సంస్థలు వార్తలు వండి వార్చారు. ఆ వార్తన్నిటిని తలకిందులు చేసారు బాలకృష్ణ.
ఈ దసరా సందర్భంగా విడుదలైన మూడు సినిమాల్లో భగవంత్ కేసరి హిట్ అవడంతో నందమూరి అభిమానులకి ఎక్కడ లేని సంతోషం. లియో-టైగర్ నాగేశ్వరావు లాంటి భారీ బడ్జెట్ సినిమాలపై భగవంత్ కేసరి పోటీ పడి గెలవడం ఒక ఎత్తైతే.. ముఖ్యంగా రవితేజ మీద బాలకృష్ణ గెలవడం మరో ఎత్తు. ఇప్పుడు భగవంత్ కేసరి తో బాలకృష్ణ, రవితేజ టైగర్ నాగేశ్వరావు తో రవితేజ పోటీ పడడం అనేది మొదటిసారి కాదు.. బాలకృష్ణ, రవితేజ ఇప్పటివరకు మూడు సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు.
వీరిద్దరూ పోటీపడిన ప్రతిసారి రవితేజనే విన్నర్‌గా నిలవడం గమనార్హం. 2008 సంక్రాంతికి బాలకృష్ణ ఒక్కమగాడు, రవితేజ కృష్ణ సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో రవితేజ కృష్ణ సినిమా విజయాన్ని దక్కించుకోగా.. ఒక్క మగాడు డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత ఒక్క రోజే కాకపోయినా 2009లో రవితేజ కిక్, బాలకృష్ణ మిత్రుడు సినిమాలు వారం గ్యాప్‌లో థియేటర్లలోకి వచ్చాయి. అందులో రవితేజ కిక్ ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా మిత్రుడు వారంలోనే దుకాణం సర్దేసింది.
మళ్ళీ రెండేళ్ల విరామం తర్వాత 2011లో రవితేజ మిరపకాయ్, బాలకృష్ణ పరమవీరచక్రసినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అప్పుడు కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యింది. బాలకృష్ణ, రవితేజ ఇప్పుడు నాలుగోసారి ఫైట్‌కు దిగారు. ఈ ఇద్దరిలో విన్నర్‌గా ఎవరు నిలుస్తారన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు.
ఫైనల్ గా నాలుగోసారి బాలకృష్ణ రవితేజ పై గెలిచి చూపించారు. టైగర్ నాగేశ్వరావు మంచి సినిమానే. రవితేజ కష్టపడ్డాడు. సినిమాకి అతి ముఖ్యమైన మైన పాయింట్ గా నిలిచిన టైగర్ నాగేశ్వరావు నిడివి కూడా కట్ చేసారు. అయినా సినిమాని ప్రేక్షకులు మెచ్చలేదు. ఫైనల్ గా భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరావుపై పై చెయ్యి సాధించింది. దసరా విన్నర్ భగవంత్ కేసరి ముందు విజయ్ లియో, టైగర్ రెండూ దిగదుడుపే అంటూ ప్రేక్షకులు తేల్చేసారు. ఇప్పుడు దసరా విన్నర్ నందమూరి బాలకృష్ణ.. అలియాస్ నేలకొండ భగవంత్ కేసరి అంటూ నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.