ఎన్నికల వేళ వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోదని స్పష్టం చేశారు. కేవలం సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు షర్మిల మీడియా సమావేశంలో వెల్లడించారు. తాము కూడా పోటీలో నిలిస్తే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలి తద్వారా అధికార పార్టీకి లాభం చేకూరినట్టు అవుతుందన్నారు. దీంతో పోటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు షర్మిల వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని గతంలో ప్రకటించిన షర్మిల సరిగ్గా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం రోజున ఈ నిర్ణయం వెల్లడించడం విస్మయాన్ని కలిగించింది.
పాలేరులో పోటీపై భావోద్వేగం..
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదని.. అసలు దేశంలో అతి పెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ అని షర్మిల పేర్కొన్నారు. ఇక ఆది నుంచి షర్మిల పాలేరు నుంచి బరిలోకి దిగాలని భావించారు. ఈ విషయమై ఆమె నేడు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలకు ఆమె క్షమాపణ చెప్పారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎవరైనా బాధ పడితే క్షమించాలని వేడుకున్నారు. అయితే పాలేరు ప్రజలకు సమాధానం బాధ్యత తనపై ఉందని.. తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని గతంలో మాట ఇచ్చానన్నారు. పాలేరులో తాను చేసిన ప్రతి పోరాటంలో పొంగులేటి శ్రీను అన్న తన వెంట ఉన్నారన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ సమయంలోనూ శ్రీను అన్న తనతో ఉన్నాడని పేర్కొన్నారు. అందుకే పోటీ విషయంలో ఏం చేయాలో చెప్పాలని నిర్ణయాన్ని పాలేరు ప్రజలకే షర్మిల వదిలేశారు.
కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా?
ఇక షర్మిల నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా? అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. ఒకప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ప్రాంతీయ భావాన్ని కేసీఆర్ రెచ్చగొట్టే అవకాశముందని పేర్కొన్నట్టు టాక్ నడిచింది. అందుకే ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదని సమాచారం. మరి ఇప్పుడు వైఎస్సార్‌టీపీ మద్దతుగా నిలిచినా కూడా సీఎం కేసీఆర్ కానీ.. బీఆర్ఎస్ పార్టీ కానీ తిరిగి అదే పని చేస్తే పరిస్థితి ఏంటి? ఓ అస్త్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టినట్టే కదా? అసలు షర్మిల నిర్ణయం అనేది కాంగ్రెస్ పార్టీతో చర్చించిన మీదటే తీసుకున్నారా? లేదంటే స్వయంగా తీసుకున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీ పూర్తిగా తెలంగాణ రాజకీయాలకు పరిమితమయ్యారు కాబట్టి కాంగ్రెస్‌కు కలిసొచ్చినా రావొచ్చు. ఇక చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో..