స్కిల్ డెవలప్‌మెంటు కేసు తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కేసులో అరెస్ట్ అవడం.. 50 రోజులుగా పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటం వంటి అంశాలు ఏపీలో కల్లోలం రేపాయి. తాజాగా చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయినా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు చల్లబడినట్టు లేవు. ఆయన బయటకు రావడాన్నే జీర్ణించుకోలేకపోయారు. ఆ తరువాత కూడా ఆయనపై ఆంక్షలు విధింపజేసేందుకు హైకోర్టులో పిల్ వేశారు. ఇక తాజాగా ఇసుక వ్యవహారంలో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ 12 మందిని విచారించాలంటూ ఫిర్యాదు..
ఎలాగైనా చంద్రబాబును బయట తిరగనివ్వకూడదనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఇలా కేసుల మీద కేసులు వేయిస్తోందన్నది బహిరంగ రహస్యం. ఇక ఈ కేసులు ఇంకెన్ని పెడతారు? ఇంకెంత కాలం పెడతారంటూ పెద్ద ఎత్తున టాక్ నడుస్తున్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంటు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో స్కిల్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న 12 మందిని విచారించాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి ఐఏఎస్ అధికారులు అజేయ కల్లాం, అజయ్ జైన్‌తో పాటు సీమెన్స్ ప్రాజెక్ట్ అమలు, పర్యవేక్షణ కమిటీలోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఫిర్యాదుదారు కోరారు. మొత్తానికి మరోసారి స్కిల్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ కేసును అడ్డుపెట్టుకుని చంద్రబాబును ఏపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందని జనంలో చర్చ నడుస్తోంది.
ప్రశాంతంగా ఉండనివ్వరా?
అప్పటి సీఎండీ బంగారు రాజాతో పాటు కార్పొరేషన్‌లోనీ సీఈవో, సీఎఫ్‌వో, ఈడీలను కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వున్న అజయ్ రెడ్డి తదితరులపై ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఈ వ్యవహారంలో ఇంకెన్ని లూప్ హోల్స్ వెదికి చంద్రబాబును ఏపీ ప్రభుత్వం ఇరికించేందుకు యత్నిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కనీసం అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని కూడా ప్రశాంతంగా ఉండనిచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఫైబర్ నెట్ కేసు, స్కిల్ కేసు, లిక్కర్ కేసు, ఇసుక కేసు.. ఇంకెన్ని కేసులు పెడతారు? అన్నింటిలోనూ చంద్రబాబే నిందితుడు. ఇసుకను ఉచితంగా ఇచ్చారని కేసేంటని సామాన్య ప్రజానీకం సైతం విస్తుబోతున్నారు. 150 రూపాయలకే కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోను సౌకర్యం అందించినందుకు ‘ఫైబర్ నెట్’ ఇలా చేసిన ప్రతి మంచిలోనూ చెడును వెదికి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కేసులు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.