క్రికెట్ వరల్డ్‌కప్ 2023లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 326 పరుగులను చేసింది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమిస్‌కు క్వాలిఫై కావడంతో.. నామమాత్రపు మ్యాచ్‌గానే జరిగినప్పటికీ.. ఇరు జట్లు సీరియస్‌గా తలపడ్డాయి. భారత ఆటగాళ్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలని సౌతాఫ్రికా జట్టు, సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచాలని భారత జట్టు.. ఇలా ఇరు జట్లు నువ్వా నేనా అనేలా పోటీ పడ్డాయి. అయితే భారత్ క్రికెట్ జట్టు ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచి సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడటంతో.. స్కోరు బుల్లెట్ ట్రైన్‌లా పరుగులు తీసింది.
అగ్రెసివ్‌గా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన రోహిత్ 24 బంతుల్లో 40 పరుగులు చేసి.. భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రన్ మెషీన్ కింగ్ కోహ్లీ అజేయ సెంచరీ (101)తో నాటౌట్‌గా నిలవడమే కాకుండా.. క్రికెట్ గాడ్ సచిన్ సెంచరీల రికార్డ్‌ను సమం చేశాడు. అయితే కోహ్లీ వచ్చిన కాసేపటికే ఓపెనర్ గిల్ (23) అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కోహ్లీ భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. శ్రేయస్ అయ్యర్ కూడా దూకుడుగా ఆడుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. శ్రేయస్ అయ్యర్ (77) పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెఎల్ రాహుల్ (8) కూడా వెంటనే అవుటయ్యాడు. రాహుల్ అవుట్ అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఫోర్ల వర్షం కురిపించాడు. 14 బంతులకు 22 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. షమ్సీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
స్కై అవుట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో స్కోర్ పరుగులు పెట్టింది. 15 బంతులు ఆడిన జడేజా 3 ఫోర్లు 1 సిక్సర్‌తో 29 పరుగులు రాబట్టాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. 327 పరుగుల లక్ష్యంతో ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టును సిరాజ్ స్టార్టింగ్ ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్న డికాక్‌ను బౌల్డ్ చేసి.. భారత్‌కు బ్రేకిచ్చాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అపజయమనేది ఎరుగని భారత్ జట్టు.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునే దిశగా మ్యాచ్ నడుస్తోంది.