వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా ఆదేశాలు జారీ చేయడంలో దిట్ట. ఆ పార్టీ అధినేత చెప్పినట్టే నేతలంతా నడుచుకోవాలి. తేడా వచ్చిందో వారి పని అస్సామే. తొక్కిపడేస్తారని టాక్. ఎంపీ రఘురామ కృష్ణరాజు అంతటోడినే ఎదురు తిరిగారని ముప్పు తిప్పలు పెట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించారు. అలాంటిది చిన్నా చితకా లీడర్లు ఒక లెక్క. గీసిన గీత దాటితే వేటే. ఇలాంటి వైసీపీ అధినేత జగన్ ఎదుటి పార్టీ ఏం చేసినా సరే తప్పులు ఎంచుతుంటారు గురువింద గింజ మాదిరిగా. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం నేరం, ఘోరం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు సహేతుకం.. దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ ఏపీ అధ్యక్షురాలిని చేయడం దారుణం.
జెండీ పీకేయడం ఎందుకు అనకూడదు?
ఇలా ఒకటేంటి? పనిగట్టుకుని మరీ తప్పులు ఎంచుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫోకస్ తెలంగాణ ఎన్నికలపై పడింది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం దారుణమట. అసలు ఆ పార్టీ ఎక్కడ పోటీ చేయాలో కూడా వీళ్లే డిసైడ్ చేస్తారు. మరి వైసీపీ పోటీ చేయలేదు కదా. ఇది అనవసరం అంటారు. ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే టీడీపీ తప్పుకుందని.. దీన్ని జెండా పీకేయడం అని ఎందుకు అనకూడదంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఒకవేళ పోటీ చేసినా కూడా దానికి ఏదో ఒక రకంగా తప్పుబడతారు. ఏపీలో టీడీపీని రాకుండా చేయాలని నానా తంటాలు పడుతున్నారు ఓకే కానీ పక్క రాష్ట్రాల రాజకీయాల గురించి కూడా మనకే కావాలంటే ఎలా?
వీసమెత్తైనా బాధ ఉండదు కానీ..
ఏ పార్టీ అయినా తనకు అనుకూలంగా స్టాండ్ తీసుకునే రైట్ ఉంటుంది కదా. నువ్వు చేస్తే సంసారం.. ఎదుటోడు చేస్తే వ్యభిచారమంటే ఎలా అని జనం ప్రశ్నిస్తు్న్నారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నికలకు వెళ్లకుండా చూడాలని నానా తంటాలు పడుతున్నారు. కేసుల మీద కేసులు పెట్టి ఆ పార్టీ అధినేతను అసలు జైలు నుంచి బయటకు రాకుండా చూడాలని స్కెచ్‌ల మీద స్కెచ్‌లు గీస్తున్నారు. తనపై రాజకీయకక్షతో అమరావతిని పాడుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ని నాశనం చేయవద్దని చంద్రబాబు నెత్తి నోరు కొట్టుకున్నా వినలేదు. చివరికి రాజధాని లేని రాష్ట్రం చేసి పడేశారు. ఇది చాలదన్నట్టుగా పరిశ్రమలన్నీ రాష్ట్రం విడిచి వెళ్లిపోవడానికి వైసీపీ ప్రభుత్వ వైఖరే కారణమని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. వీటన్నింటికీ విజయసాయిరెడ్డి వీసమెత్తైనా బాధ ఉండదు కానీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని తెగ బాధపడిపోతున్నారు. టీడీపీ ఎన్నికల్లో నిలిస్తేనే ఆ బాధ తీరుతుందట.