స్టార్ హీరోల సినిమాలు పదే పదే విడుదల వాయిదా పడుతూ ఆగిపోవడమనేది ఎక్కడో కానీ జరగదు. కానీ కోలీవుడ్ లో అదే జరిగింది, జరుగుతుంది. హీరో చిన్నవాడు కాదు, అలాగని దర్శకుడు అనామకుడు కాదు. ఇద్దరూ పేరున్నదర్శక-హీరోలే. కానీ వారి కాంబినేషన్ లో తెరకెక్కిన ఓ చిత్రం విడుదలకు నానా తంటాలు పడుతుంది. అది ఏ సినిమానో, ఆ హీరో ఎవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ల ధ్రువ నక్షత్రం. షూటింగ్ పూర్తయ్యి ఏళ్ళు గడిచిపోయింది. విడుదల తేదీలు మార్చుకుంటూ ఇన్నాళ్ళకి విడుదలవుతుంది అనుకున్నారు.
ఈరోజు నవంబర్ 24 న ధ్రువ నక్షత్రం విడుదల అంటూ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ట్రైలర్స్ వదిలారు. కానీ గత వారం రోజులుగా ప్రమోషన్స్ ఆపేసారు. అప్పుడే అందరిలో డౌట్ క్రియేట్ అయ్యింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ధృవ నక్షత్రం మరోసారి పోస్ట్ పోన్ అంటూ వార్తలొచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ ఈరోజు ఉదయం డైరెక్టర్ గౌతమ్ మీనన్ సోషల్ మీడియా ద్వారా సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేసారో వెల్లడించారు. ఆ పోస్ట్ చూసాక విక్రమ్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు.
గౌతమ్ వాసు దేవ్ మీనన్ ఓ నోట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. సారీ, ధృవ నక్షత్రం చిత్రాన్ని ఈరోజు థియేటర్ల లోకి తీసుకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాము. కానీ, మాకు ఒకటి లేదా రెండు రోజుల సమయం కావాలి. ఆడియన్స్ కి మంచి అనుభూతి అందిస్తాం అని ఆశిస్తున్నాం అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అంత పెద్ద స్టార్ హీరో విక్రమ్, పేరున్న దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ల సినిమాకే ఇలాంటి పరిస్థితా అంటూ ప్రేక్షకులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు.