తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రచారపర్వం కూడా నేటితో ముగియనుంది. ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఒకే విడతలో రాష్ట్రమంతటా పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇక అంతా బాగానే ఉంది కానీ ఓటరు నాడి పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. దీని కోసం అనేక సర్వే సంస్థలు యత్నించాయి కానీ ఎవరికీ దొరకలేదనే చెప్పాలి. ఎందుకంటే సర్వే సంస్థలు కొన్ని బీఆర్ఎస్‌కు పట్టంకడితే మరికొన్ని కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. ఏ సర్వే నిజమవుతుందో కూడా తెలియని పరిస్థితి. అసలు ఓటరు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేకపోతున్నాడనేది రాజకీయ విశ్లేషకుల మాట.
ఎవరు డబ్బెక్కువిస్తే వారికే ఓటు..
తెలంగాణ తెచ్చామని ఒకరు.. తెలంగాణ ఇచ్చామని మరొకరు ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో అయితే కాంగ్రెస్ అంటే కలహాల పార్టీ. ఈసారి మాత్రం అలాంటివేం లేకుండా నేతలంతా పార్టీ విజయం కోసం సమిష్టిగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. జనం చూస్తుంటే ఎవరు ఏ సభ పెట్టినా తండోపతండాలుగా వెళుతున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్లైతే.. ఎవరొచ్చినా తమకు ఒరగబెట్టేదేం లేదని.. కాబట్టి ఎవరు డబ్బు ఎక్కువిస్తే వారికే ఓటు వేద్దామనే ధోరణిలో ఉన్నారు. వారి నాడిని ఏ సర్వే సంస్థ పట్టుకోగలదు? ఒక ఏ పార్టీ కేడర్ ఆ పార్టీకి పక్కాగా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఎవరు గెలిచేది డిసైడ్ చేసేది తటస్థులే. వారి నాడి అంతు చిక్కడం లేదు.
అధికారానికి దూరం చేసేంత స్థాయిలో ఉందా?
ముఖ్యంగా తెలంగాణలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణలో బీభత్సంగా ప్రచారం నిర్వహిస్తున్నా కూడా ఎందుకో మునుపటి జోష్ అయితే తిరిగి రావడం లేదు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల విషయానికి వస్తే.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. బీఆర్ఎస్‌కు కొంత మేర ఎదురు గాలి వీస్తున్న మాట అయితే నిజమే కానీ అది పార్టీని అధికారానికి దూరం చేసేంత స్థాయిలో ఉందా? అనేది తెలియడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ హవా మునుపటితో పోలిస్తే బీభత్సంగా పెరిగింది. కానీ అది అధికారాన్ని బీఆర్ఎస్ నుంచి లాక్కురాగులుగుతుందా? అనేది తెలియడం లేదు. అగ్ర నేతల నుంచి చోటా నేతల వరకూ ప్రచారాన్ని విరివిగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎవరిని అధికార పీఠంపై కూర్చోబెడతారు? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.