తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అదేనండీ పోస్టల్ బ్యాలెట్ల పర్వం. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులకు ఎన్నికల సంఘం పోస్టల్ ఓట్లు కేటాయిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి 80 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసు అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు వేయకుండా కేసీఆర్ పక్కా స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.
ఎన్నికల విధులు కల్పించడంలో తాత్సారం..
పోలింగ్ విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు వేసుకునేందుకు ఒక్క రోజు మాత్రమే ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. కనీసం పోలింగ్ విధులు కూడా కేటాయించక మునుపే పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించడం గమనార్హం. ఎన్నికల విధులు కేటాయించకుంటే ఎలా దరఖాస్తు చేసుకుంటారు? అయితే ఉద్యోగులకు ఎన్నికల విధులు కల్పించడంలో ప్రభుత్వమే తాత్సారం చేసిందని ఆరోపణలు వినవస్తున్నాయి. కేసీఆర్ సర్కారుపై ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ క్రమంలోనే తమకు ఉద్యోగుల మద్దతు ఏమాత్రం ఉండదని భావించిన టీ సర్కారు ఎన్నికల విధులు కేటాయించలేదని.. తద్వారా వారికి ఓటు వేసే అవకాశాన్ని లాగేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సైలెంట్‌గా ఉద్యోగులపై దెబ్బేశారట..
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. దరఖాస్తు చేసుకున్న వారి ఓట్లు చూడా చాలా వరకూ గల్లంతయ్యాయట. చాలా మందికి బ్యాలెట్ ఓటు అనేది ఇవ్వలేదట. అదేమంటే.. ఆందోళన చెందవద్దని.. సముదాయించే ప్రయత్నం చేస్తోందట. ఇదంతా ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. డీఏలు పెండింగ్, బిల్లుల మంజూరులో జాప్యం, పీఆర్సీలో జాప్యం, తదితర కారణాలతో ఉద్యోగులంతా ఈసారి కేసీఆర్ సర్కారుపై గుర్రుగా ఉన్నారు. ఈ విషయం గులాబీ బాస్‌కి కూడా తెలుసు. అందుకే సైలెంట్‌గా ఉద్యోగులపై దెబ్బేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని గ్రహించి తమను ఓటు వేయకుండా అడ్డుకుంటోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇలా ఎంతమందిని ప్రభుత్వం కట్టడి చేయగలదు? ఇలాంటివి చేసి ఉద్యోగుల్లో మరింత వ్యతిరేకతను పెంచుకోవడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.