దేశంలోనే అత్యంత కాస్ట్లీగా టీఎన్నికలు మారబోతున్నాయా?
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఒక్కరోజే సమయం ఉంది. నేటితో ప్రచారపర్వం ముగియనుంది. నేటి సాయంత్రానికి నాన్ లోకల్స్ అంతా వెళ్లిపోనున్నారు. మైకులు మూగబోనున్నాయి. ఇక పలికేది.. డబ్బు, మందే. నేటి సాయంత్రం నుంచి మందు ఏరులై పారుతోంది. నోట్ల కట్టలకు రెక్కలొస్తాయి. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. ఇప్పటికే మద్యం, డబ్బు పంపిణీకి ఏర్పాట్లు అయితే జరిగిపోయాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఓటు పెద్ద ఎత్తున పలుకుతోందట. కరీంనగర్, వేములవాడ, మునుగోడు, ములుగుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే తెలంగాణ ఎన్నికలు అత్యంత కాస్ట్లీ ఎన్నికలు కానున్నాయట.
ఓటు రూ.10 వేలు పలికిందట..
రాష్ట్రం మొత్తమ్మీద అన్ని పార్టీలు కలిసి రూ.20 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయవచ్చని సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో డబ్బు పెద్ద ఎత్తున పంపిణీ జరిగింది. ఆయా ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకోవడంతో ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నికలోనే రూ.700 కోట్లకు పైగా ఖర్చయినట్టు తెలుస్తోంది. ఇక మునుగోడు ఉపఎన్నికలో అయితే ఓటు దాదాపు రూ.10 వేలు కూడా పలికిందట. ఇక ఇప్పుడు ఆ స్థాయిలో ఉండకపోవచ్చేమో కానీ ఈసారి కూడా ఖర్చు తడిచి మోపెడు అయ్యేలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా జనరల్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఓటు రూ.5 వేల వరకూ పలుకుతోందని ప్రచారం జరుగుతోంది.
ప్రతి 100 మందికి ఇద్దరు, ముగ్గురు లీడర్లు..
ఇక పలు చోట్ల అయితే ఓటు దాదాపు రూ.3 వేలు పలుకుతోందట. ముందుగా ఎదుటి పార్టీ అభ్యర్థి ఓటుకు ఎంత ఇస్తే దానికంటే ఎక్కువ ఇవ్వాలి.. లేదంటే తనకు ఓటు వేయడేమోనన్న బాధతో మరింత ఎక్కువ ఓటరుకు అభ్యర్థులు ముట్టజెబుతున్నారట. అధికార పార్టీ అయితే బూత్ స్థాయిలో ప్రతి 100 మందికి ఇద్దరు, ముగ్గురు లీడర్లను పెట్టినట్టు తెలుస్తోంది. ఆ 100 మంది చేత ఓటు వేయించే బాధ్యత వారిదే. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు ఖమ్మం జిల్లా, కరీంనగర్, మునుగోడు, వేములవాడ, కామారెడ్డి, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఓటు భారీ ధర పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వందల కోట్ల రూపాయల్లో డబ్బు దొరికినా కూడా అది ఎక్కువశాతం రాజకీయ నాయకులది కాదని సమాచారం. మొత్తానికి ఈ కొన్ని గంటల్లో ఎంత డబ్బు పంపిణీ అవుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.