నిన్నటితో ప్రచారం అయితే ముగిసింది. అన్ని పార్టీలు తమ శక్తి మేర ప్రచారం నిర్వహించాయి. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి మరీ ప్రచారం నిర్వహించాయి. అన్ని పార్టీల అగ్రనేతలు తిరిగి వెళ్లిపోయారు. నిన్నటి వరకూ సందడిగా సాగిన తెలంగాణ ఇవాళ సైలెంట్ అయిపోయింది. హైదరాబాద్‌లోనూ పెద్దగా జనసందోహం కనిపించడం లేదు. సర్వత్రా 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇక ప్రలోభాలకు నిన్న సాయంత్రం నుంచే అన్ని పార్టీలు తెరదీశాయి. ఎంత గట్టి బందోబస్తు ఉన్నా సరే వారి కళ్లు గప్పి చేరాల్సిన ప్రాంతాలకు డబ్బంతా చేరిపోయిందని టాక్. డబ్బు, మద్యం ప్రస్తుతం తెలంగాణలో రాజ్యమేలుతోంది. ఓట్లు కురిపించడంలో ఇవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
పార్టీలు కురిపించిన వాగ్దానాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో సంక్షేమ పథకాలతో జనాలకు ప్రధాన పార్టీలన్నీ ఎర వేశాయి. ఇక ఈ పథకాలు ఒక ఎత్తైతే.. నిన్న సాయంత్రం నుంచి నడుస్తున్న ప్రలోభాలు ఒక ఎత్తు. ఇవి రెండే ప్రస్తుతం అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే కొలమానాలనడంలో సందేహం లేదు. ఇక ఇది కూడా పూర్తైందో.. ఆ వెంటనే ప్రణాళికలు ప్రారంభమవుతాయి. ఏదో ఒక పార్టీకి మంచి మెజారిటీ వస్తే పర్వాలేదు కానీ అలా రాకుండా హంగ్ ఏర్పడే పరిస్థితి వచ్చిందో అసలు సినిమా ప్రారంభమవుతుంది. ఒక సర్వే తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశముందని ఇప్పటికే చెప్పింది. ఈ క్రమంలోనే ఒకవేళ హంగ్ ఏర్పడే పరిస్థితి వస్తే.. అది రాజకీయ పార్టీలకు పెను సవాల్‌గా మారుతుంది.
రాష్ట్రంలో హంగ్ ఏర్పడేలా ఉంటే ఇక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి గెలుపు కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. క్యాంపు రాజకీయాలు బీభత్సంగా నడుస్తాయి. అభ్యర్థులను కాపాడుకోవడం పెను సవాల్ అయిపోతుంది. ఏ పార్టీ అభ్యర్థి ఏ పార్టీ వైపు నడుస్తాడో... ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తాడో తెలియక అన్ని పార్టీల అగ్రనేతలకు చుక్కలు కనిపిస్తాయి. ఒకవేళ హంగ్ ఏర్పడే అవకాశం ఉంటే.. అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీలన్నీ ఇప్పటికే ప్రణాళికలు రచించినట్టు సమాచారం. ఇక చూడాలి ఏం జరుగుతుందో.. డిసెంబర్ 3న ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది.