తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. తాజాగా ఈ ఎన్నికలు గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న స్పీకర్ సెంటిమెంటుకు బ్రేక్ పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి అంటే 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లుగా పోటీ చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచింది లేదు. ప్రస్తుతం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ఈ సెంటిమెంటుకు బ్రేక్ పడబోతోంది. తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ ఎదురీదుతుండగా.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం అప్రతిహతంగా దూసుకుపోతున్నారు.
బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి మంచి మెజార్టీతో సక్సెస్ దిశగా సాగుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పోచారం మంచి మెజార్టీతో దూసుకెళుతున్నారు. 1991 నుంచి నిన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను పరీక్షిస్తే ఒకసారి స్పీకర్‌గా పని చేసిన ఏ నేత కూడా తదుపరి ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన దాఖలాలే లేవు. స్పీకర్‌గా చేసిన వ్యక్తి నెక్ట్స్ ఎన్నికల్లో విజయం సాధించారనే సెంటిమెంట్ కారణంగా ఎవరూ ఆ పదవి చేపట్టేందుకు మొగ్గు చూపేవారు కాదు. ఈ క్రమంలోనే సీఎంలకు సైతం స్పీకర్‌ను నియమించాలంటే తలకు మించిన భారంగా మారేది.
గత తెలంగాణ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి పోటీ చేసిన అప్పటి స్పీకర్ మధుసూదనాచారి సైతం ఓటమి పాలయ్యారు. ఆయన కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. మధుసూధనాచారి అయితే సెంటిమెంటుకు భయపడి నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించేందుకు యత్నించేవారు. అయినా కూడా ఆయనకు ఓటమి తప్పలేదు. ఇక రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా 2014 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. కోడెల శివప్రసాద్ సైతం 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఈ సెంటిమెంటుకు పోచారం అయితే బ్రేక్ చేయబోతున్నారు.