విశాఖ నుంచి పరిపాలన సాగించాలనేది ఏపీ సీఎం జగన్ కల. దాని కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. విశాఖకు తన నివాసాన్ని మారుస్తున్నారు ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం సైతం దాదాపు పూర్తై పోయింది. ఈ సమయంలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీకి అమరావతినే రాజధానిగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. దాని మాస్టర్‌ప్లాన్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసినట్లు సైతం వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసిన క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
విశాఖ రాజధానికి ముహూర్తం..
దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంది. పార్లమెంటులోనే ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సీఎం జగన్ ఏదో అనుకుంటే.. కేంద్రం మాత్రం మరొకటి తలచింది. మొత్తానికి జగన్‌కు అయితే ఇది దారుణమైన షాక్. ఇప్పుడు జగన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు పర్యాయాలు విశాఖ రాజధానికి ముహూర్తం పెట్టేశారు. మళ్లీ ఎందుకో వెనుకడుగు వేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో రాజధానుల విషయాన్ని కొందరు సభ్యులు ప్రశ్నించగా.. కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిషోర్ దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని.. వాటిలో అమరావతి ఒకటని తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా తెలిపారు.
సుప్రీంకోర్టులో కేసు ఉన్నా...
సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తన హయాంలో కట్టిన కట్టడాలన్నీ నేల కూల్చాయి. ఆయన రాజధానిగా అమరావతిని చేశాడు కాబట్టి దానిని ఉంచకూడదు ఇదే పంథాను కొనసాగించారు. అమరావతిని సర్వనాశనం చేశారు. రాజధాని నిర్మాతగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారనే ఒకే ఒక్క కారణంతో మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేసిన ఘనత జగన్‌దే. ఇప్పుడు కేంద్రం మాత్రం అమరావతే రాజధానిగా గుర్తించడంతో జగన్ సర్కార్ అయోమయంలో పడింది. సుప్రీంకోర్టులో కేసు ఉన్న విషయాన్ని కూడా పక్కనబెట్టి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలన్న జగన్ అహంకారానికి ఇదో పెద్ద దెబ్బే. అయినా సరే విశాఖే రాజధాని అంటారా? ఇక చూడాలి ఏం జరుగుతుందో..