కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ అన్నంత పని చేశాడు. ఇటీవల త్రిష విషయంలో జరిగిన రచ్చపై ఆయన మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు. తమిళ హీరోయిన్లు త్రిష, ఖుష్బూలతో పాటు టాలీవుడ్‌కి చెందిన మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఆయన పరువు నష్టం దావా వేశాడు. తను మాట్లాడిన మాటలు పూర్తిగా వినకుండా.. చిన్న బిట్ విని.. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఆ ముగ్గురు చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు వేసినట్లుగా మన్సూర్ అలీఖాన్ చెప్పుకొచ్చారు. డిసెంబర్ 11న మద్రాసు హైకోర్టులో ఈ కేసు విచారణను రానుందని తెలుస్తోంది.
విషయంలోకి వస్తే.. ఇటీవల తమిళ సీనియర్ నటుడైన మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఎన్నో రేప్ సీన్లలో నటించాను. విజయ్, లోకేష్ కనకరాజ్ సినిమా లియోలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నాను. ఆ సీన్ లేకపోవడం వల్ల తనకి బాధ కలిగిందన్నారు. అంతే.. ఆయన మాట్లాడిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయి త్రిష వరకు వెళ్లింది. వెంటనే త్రిష సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మన్సూర్ అలీఖాన్ వంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తుందని, తన లైఫ్‌లో మళ్లీ ఈ నటుడితో నటించనంటూ తన కోపాన్ని సోషల్ మీడియా ద్వారా త్రిష తెలియజేసింది. త్రిష పోస్ట్ అనంతరం ఆమెకు లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, మెగాస్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి వంటి వారంతా సపోర్ట్‌గా నిలిస్తూ.. మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మన్సూర్ ఓ వీడియోలో.. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం, గౌరవం ఉందని చెబుతూ.. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదని.. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసంటూ త్రిషకు క్షమాపణలు చెప్పాడు.
అయితే అప్పటికే అతని వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుని.. సుమోటోగా స్వీకరించి మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మన్సూర్ మరో వీడియోలో.. త్రిష, ఖుష్బూ, చిరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన మొత్తం వీడియోను చూడకుండా తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపిస్తూ.. ఒక్కొక్కరి నుండి రూ.1 కోటి డిమాండ్ చేస్తూ.. త్రిష, ఖుష్బూ, చిరులకు మన్సూర్ నోటీసులు పంపించాడు. చూడాలి.. ఈ కేసు ఏ దిశగా వెళుతుందో..