జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ షర్మిల.. కాలం గిర్రున తిరగడంతో ఆ బాణం.. జగనన్న పైకే దూసుకెళుతోందా? అంటే ఔననే సమాధానమే వినవస్తోంది. నిజానికి ఇది ఈనాటి మాట కాదు.. ఎప్పటి నుంచో జరుగుతున్న తంతే. ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోందని టాక్. వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అసలే అన్నాచెల్లెల్లిద్దరికీ పడటం లేదు. జగన్ ఆ దరిన.. షర్మిల ఈ దరిన కలిపేందుకు ఏ కృష్ణమ్మ వల్లా కావడం లేదు. షర్మిల ఇప్పటి వరకూ అన్నపై ఎలాంటి విమర్శలూ నేరుగా చేయలేదు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే..
అయితే ఈసారి విమర్శలు కాదు.. నేరుగా అన్ననే ఏకంగా ఢీకొట్టబోతోందట. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏపీపై కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టారట. గెలుస్తుందా? లేదా? అనేది తర్వాతి విషయం కానీ పార్టీని నిలబెట్టుకోవాలి. దీనికోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి.తమకు సమయం ఎక్కువగా లేదని.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రెస్‌తో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుందని భావిస్తున్నామని అన్నారు. దీంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది.
కాంగ్రెస్ పగ్గాలను షర్మిల పట్టుకున్నారా?
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని సమాచారం. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఇన్‌చార్జికి సైతం దీనికి సంబంధించిన ఆదేశాలు వెళ్లాయని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా తన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలంటే ఏపీ బాధ్యతలు తీసుకోవాలంటూ ఆ పార్టీ అధిష్టానం షర్మిలకు సూచించాయని ప్రచారం నడిచింది. అయితే అప్పట్లో షర్మిల అంగీకరించలేదని కూడా టాక్ నడిచింది. ఇప్పుడు మరోసారి ఇదే ప్రచారం జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ పగ్గాలను షర్మిల పట్టుకున్నారా? వైసీపీకి దారుణమైన దెబ్బ పడే అవకాశమూ ఉంది. వైసీపీ కేడర్ కొంత మేర షర్మిల వైపునకు మళ్లే అవకాశం ఉంది. షర్మిలలో కాంగ్రెస్ రక్తముందని.. ఆమె చేరికతో ఇరువురి ఉనికీ బలోపేతమవుతుందని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.