రాజకీయాల పరంగా లేదంటే ఆర్థికంగానో ఎన్ని విభేదాలున్నా ఇంట్లో శుభకార్యం విషయానికి వస్తే మాత్రం కుటుంబ సభ్యులంతా విభేదాలను పక్కనబెట్టేసి ఏకమవుతారు. కొందరు మాత్రం అట్టే పట్టుకుని కూర్చొంటారు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల విషయంలో ఇదే జరుగుతోంది. అయితే ఇక్కడ సీన్ వేరు. షర్మిల మాత్రం తన కుమారుడి ఎంగేజ్‌మెంట్, వివాహ మహోత్సవానికి తన ఒక్కగానొక్క అన్నను ఆహ్వానించేందుకు వెళుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి చాలా మొండి వ్యక్తి. పట్టుబట్టారంటే ఓ పట్టాన వదలరు కానీ ఇప్పుడు షర్మిల తనకు వ్యతిరేకంగా రంగంలోకి దిగితే సీన్ మారిపోతుంది.
షర్మిల ముందు ఏమైనా డీల్ పెడతారా?
పైగా నేటి సాయంత్రం షర్మిల హస్తినకు బయలుదేరనున్నారు. కానున్న కార్యం గంధర్వులే తీర్చినట్టుగా.. హస్తినకు బయలుదేరడానికి ముందే షర్మిలతో భేటీ అయ్యే అవకాశం జగన్‌కు దొరికింది. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారా? షర్మిల ముందు ఏమైనా డీల్ పెడతారా? షర్మిల దానికి అంగీకరిస్తారా? వంటి అంశాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నేటి సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు షర్మిలకు జగన్ సమయమిచ్చారు. ఇక షర్మిల తన కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్, పెళ్లికి జగన్ దంపతులను ఆహ్వానించి వెనుదిరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇద్దరి మధ్య కాంగ్రెస్‌లోకివెళ్లే విషయం, ప్రస్తు త రాజకీయపరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
జగన్ సీఎం అయ్యాక షర్మిలను పక్కనబెట్టేశారు..
ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అట్లూరి ప్రియను.. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇడుపులపాయకు వెళ్లి తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్న షర్మిల ఇవాళ సాయంత్రం తాడేపల్లికి వెళ్లనున్నారు.షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉంటారని తెలుస్తోంది.రాజారెడ్డి-ప్రియల నిశ్చితార్థ వేడుక జనవరి-18న, ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఇదంతా పెద్ద విషయం కాదు కానీ జగన్, షర్మిల భేటీయే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ సీఎం అయ్యాక షర్మిలను పక్కనబెట్టేశారు. ఆమెకు ఆస్తి పంపకాల విషయంలోనూ అన్యాయం చేశారు. అయితే షర్మిల పార్టీ మారబోతున్నారని తెలిసిన దగ్గర నుంచి ఆమెతో రాయబారాలు నడుపుతున్నారు. ఇక ఇప్పుడు స్వయంగా కలవబోతున్నారు కాబట్టి ఏం జరుగుతుందో అనేది హాట్ టాపిక్‌గా మారింది.