చంద్రబాబు ఇంటికి షర్మిల.. జగన్ జీర్ణించుకుంటారా?
కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తొలుత ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ఆహ్వాన పత్రికను ఉంచి ఆశీర్వాదం తీసుకున్న మీదట.. తన అన్న జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఈ క్రమంలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. జగన్ ఆమెను కలిసేందుకు తొలుత ఇష్టపడలేదట. ఆ తరువాత సెక్యూరిటీకి కార్డు ఇచ్చి వెళతాననడంతో ఇజ్జత్ కోసం కలిసేందుకు జగన్ అంగీకరించారట. జగన్ అసహనానికి కారణం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడమేనని చెప్పనక్కర్లేదు.
ఇవాళ నిద్రపోతారా?
ఇక నేడు షర్మిల తన కుమారుడితో కలిసి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహానికి మనవారు, ప్రత్యర్థులన్న భేదమైతే లేదు కానీ జగన్ అత్యంత ద్వేషించే వ్యక్తుల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటారు. ఆయన నివాసానికి తన సొంత చెల్లి వెళ్లిందంటే ఆయనసలు జీర్ణించుకుంటారా? ఇవాళ నిద్రపోతారా? షర్మిల మనకు తెలిసి అయితే చంద్రబాబు నివాసానికి ఎన్నడూ వెళ్లింది లేదు. తొలిసారిగా ఆమె చంద్రబాబును కలుస్తుండటం అకేషన్ ఏదైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే నెక్ట్స్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లడమూ ఖాయమే.
వైసీపీ నేతలకు ఇదొక సువర్ణావకాశమే...
జగన్‌కు అత్యంత ద్వేషించే వ్యక్తులలో రెండవ వ్యక్తి పవన్ అని తడుముకోకుండా చెప్పొచ్చు. ఈ ఇద్దరినీ షర్మిల కలిస్తే జగన్ పరిస్థితేంటనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి కుమారుడి వివాహం రూపంలో ప్రతి ఒక్కరినీ తన పర భేదం లేకుండా కలిసేందుకు సదవకాశం లభించినట్టైంది. అయితే ఇప్పటికే పొత్తుల పేరిట చంద్రబాబు కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేస్తారంటూ మీడియా ముందు ఊదరగొడుతున్న వైసీపీ నేతలకు ఇదొక సువర్ణావకాశమే. ఇక జగన్ కడుపు మంటను తమదిగా చేసుకుని మీడియా ముందు ఎంత అక్కసు వెళ్లగక్కుతారోనని ఏపీలో చర్చ జరుగుతోంది. అసలు ఇదంతా ఎందుకు ఆనాడే తన చెల్లిని ఆస్తి కోసం బయటకు వెళ్లగొట్టకుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు ఎవరిని నిందించి ఏం ప్రయోజనం?