మహానటుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీ సభ్యులు హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అభిమానులు ఘాట్ వద్ద భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో పెద్దాయన ఫొటోతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణలు మాత్రమే ఉన్న ఫ్లెక్సీ ఒకటి ఘాట్‌కి వెళ్లే దారిలో ఎదురుగా పెట్టారు. ఈ ఫ్లెక్సీ చూసిన నందమూరి నటసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించాలంటూ తన అనుచరులకు చెప్పారు. ఆ ఫ్లెక్సీలను తీసేయండి అంటూ బాలకృష్ణ చెబుతున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
బాలకృష్ణ చెప్పగానే ఆయన సిబ్బంది ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఆ ప్రదేశం నుండి తొలగించారు. ఇప్పుడిది వివాదానికి కారణం అవుతోంది. దీనిని వైసీపీ కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఘాట్ వద్ద ఉన్న అభిమానులు కాసేపు ఆందోళనకు దిగారు.
ఈ మధ్య నందమూరి, నారా ఫ్యామిలీలలో జరిగిన కొన్ని సంఘటనలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదనే విషయం తెలిసిందే. ఇదే విషయం బాలయ్యని అడిగితే డోంట్ కేర్ అంటూ ముఖం మీదే చెప్పేశారు. మళ్లీ ఇప్పుడిలా ఫ్లెక్సీ ఇష్యూ నందమూరి ఫ్యామిలీని మీడియాలో హైలెట్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని తక్కువ చేసి చూస్తున్నారంటూ ఆయన ఫ్యాన్స్ గోలగోల చేస్తున్నారు.