సంక్రాంతి బరిలో చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఒక స్టార్ హీరో సినిమాకి ఎలా అయితే కలెక్షన్స్ వస్తాయో.. అలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తోనే రన్ అవుతున్న ఈ చిత్రానికి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. సినిమా చూసిన వారంతా.. అందులో నటించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ సినిమా బీజేపీ అధిష్టానానికి చేరింది.
ఆ మధ్య కార్తికేయ సినిమాని ఎలా అయితే ఓన్ చేసుకున్నారో.. ఇప్పుడు బీజేపీ నాయకులు ఈ సినిమాను కూడా దగ్గరకు తీస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి.. చిత్ర హీరో తేజ సజ్జాని సత్కరించి.. యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా తేజ సజ్జాని సత్కరిస్తున్న ఫొటోలను షేర్ చేసిన కిషన్ రెడ్డి.. అయోధ్యలోని రామమందిరానికి ప్రతి టిక్కెట్ నుండి రూ. 5 విరాళంగా ఇవ్వాలనే నిర్ణయం అభినందనీయమన్నారు.
హనుమాన్ సినిమాలో నటించిన యువ ప్రతిభావంతుడైన నటుడు తేజ సజ్జాను న్యూ ఢిల్లీలో కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం సంగతి అలా ఉంటే.. అయోధ్యలోని భగవాన్ శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలోనూ భాగమైంది. ఈ సినిమాకు తెగే ప్రతి టిక్కెట్టు నుండి రూ.5 ను అయోధ్య భవ్య రామ దేవాలయానికి విరాళంగా ఇవ్వాలనేలా తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటూ కిషన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ట్యాగ్ చేశారు.