సంక్రాంతికి విడుదల కావాల్సిన మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమాను దిల్ రాజు, ఇంకా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు చర్చలు జరిపి వాయిదా వేయించిన విషయం తెలిసిందే. దీంతో సైంధవ్‌కు పోటీగా సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈగల్.. ఫిబ్రవరి 9కి వెళ్లిపోయింది. అయితే నిర్మాతలు, పెద్దలు జరిపిన చర్చల్లో.. ఈగల్ సినిమా ఎప్పుడు విడుదలైనా.. సోలో రిలీజ్ అయ్యేలా సహకరిస్తామని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే తేదీకి ఓ నాలుగైదు సినిమాలు పోటీకి దిగుతుండటంతో.. కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
గురువారం ఊరుపేరు భైరవకోన చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్ కూడా తమ సినిమా ఫిబ్రవరి 9కే వస్తుందని, విడుదల తేదీలో మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ఫిబ్రవరి 8న యాత్ర 2 విడుదల ఉంది. అలాగే ఫిబ్రవరి 9నే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇంకా రెండు మూడు చిన్న సినిమాలు కూడా ఆ డేట్‌పై కన్నేసినట్లుగా తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే.. రవితేజకి సంక్రాంతి కంటే కూడా భారీ పోటీ ఉండేలా కనిపిస్తోంది. అయితే ఈ పోటీపై తాజాగా ఈగల్ నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌కు ఓ లేఖను పంపించారు.
ఆ రోజు సంక్రాంతి బరి నుండి తొలగాలని కోరినప్పుడు.. మాకు మీరు మాటిచ్చారు. మీ సినిమా ఎప్పుడు విడుదలైనా.. సోలోగా విడుదలయ్యేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీని నిలబెట్టుకోవాలని ఈ లేఖలో ఫిల్మ్ ఛాంబర్ పెద్దలని ఈగల్ నిర్మాతలు కోరారు. మరి ఈ లేఖపై ఫిల్మ్ ఛాంబర్ రియాక్షన్ ఏమిటనేది తెలియాల్సి ఉంది.