ఏపీ సీఎం జగన్ సంధించిన బాణం తెలంగాణలో ఉన్నంత కాలం ఓకే.. కానీ ఏపీకి తిరిగొచ్చి ఆయనకే గుచ్చుకోబోతోందన్న విషయాన్ని ఆయన కానీ.. అనుకూల మీడియా కానీ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా నీలి మీడియా తన అక్కసునంతా ఆత్మసాక్షిగా బయట పెట్టింది. పొలిటికల్ ట్రాప్‌లో షర్మిల… అవేవీ గుర్తులేవా?.. అంటూ ఒక అందమైన కథనాన్ని అంతకన్నా టేస్టీగా వండి వార్చి వడ్డించేసింది. ఇక ఈ కథనాన్ని పరిశీలిస్తే జగన్ అండ్ కో ఎంత అభద్రతాభావంలో ఉన్నారో అర్థమవుతుంది. షర్మిలకు పరోక్షంగా హితబోధ చేస్తూ తమ భయాన్ని అంతా వెళ్లగక్కేసింది. షర్మిల అమాయకురాలని కాసేపు.. అన్నకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వారితో చేతులు కలిపిన ద్రోహి అని కాసేపు అసంబద్ద వ్యాఖ్యలు చేసేసింది.
షర్మిలను ఏపీకి బలిపశువుగా తీసుకొస్తున్నారా?
ఇక పనిలో పనిగా వైసీపీ క్యాడర్‌కు షర్మిల ఎదుర్కోవడమెలాగో దిశా నిర్దేశం కూడా చేశారు. జగన్ అత్యుత్తముడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు, కొందరు మీడియా ప్రతినిధులు అంతా దుర్మార్గులట. షర్మిల అమాయకురాలు కాబట్టి వారి ట్రాప్‌లో పడిపోయిందట. షర్మిలను పావుగా మార్చుకుని వారు జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారట. అసలు షర్మిల తాను తెలంగాణలో ఉంటానని నెత్తినోరు కొట్టుకున్నారట. అయినా సరే.. పైన చెప్పుకున్న దుర్మార్గులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి జగన్‌పై రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు షర్మిలను ఏపీకి బలిపశువుగా తీసుకొస్తున్నారట. మరొక చోట షర్మిల బతిమాలుకుని మరీ ఆమె కాంగ్రెస్‌లో చేరడం అప్రతిష్ట అని రాసుకొచ్చారు. మరి షర్మిల బతిమాలుకుంటే పైన చెప్పిన వారి ప్రమేయం లేనట్టేగా?
వ్యతిరేకంగా పని చేసేందుకు రంగంలోకి దిగాలా?
షర్మిల కానీ వివేకా కూతురు సునీతా రెడ్డి కానీ తీసుకుంటున్న నిర్ణయాలు తొందరపాటువే.. లేదంటే తండ్రిని చంపేసిందేమైనా బయటి వాళ్లా? ఇంట్లోని వారే కదా అని చూసిచూడనట్టు ఊరుకోవచ్చుగా ఆ సుప్రీంకోర్టుకు వెళ్లడమేంటి? న్యాయపోరాటమేంటి? ఇక షర్మిల.. రోడ్డున నిలబెట్టింది సొంత అన్నే కదా.. ఈయనేమైనా పరాయివాడా? దీనికే ఆయనకు వ్యతిరేకంగా పని చేసేందుకు రంగంలోకి దిగాలా? అసలు ఆత్మసాక్షి ప్రకారం జగన్‌కు వ్యతిరేకంగా ఏమైనా వ్యాఖ్యలు చేసినా.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా ఆమెకే నష్టమట. కుట్రదారులతో షర్మిల చేతులు కలిపారని అందరికీ అర్థమైపోతుందట. అబ్బబ్బా ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. అది చాలదన్నట్టు.. సొంత అన్న జగన్‌ను విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు ఆమెను అసహ్యించుకుంటారట. మరి సొంత చెల్లిని నడిరోడ్డుపై నిలబెట్టిన జగననన్నను ఎవరూ అసహ్యించుకోరా? పైగా ఈసారి కూడా జగన్ గెలిస్తేనట.. కుట్రదారులంతా కలిసి షర్మిలను నిందిస్తూ వదిలేస్తారట.. దీంతో ఆమె రాజకీయ జీవితం కొలాప్స్ అట. ఏదో షర్మిల భవిష్యత్ ఇలా ఉండబోతోందంటూ ఆత్మసాక్షి బెదిరిస్తున్నట్టుగా ఉంది.