ఏపీలో పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సంబంధించిన నాలుగు జాబితాలను విడుదల చేసి ఐదో జాబితాపై పూర్తి ఫోకస్ పెట్టింది. టీడీపీ సైతం అభ్యర్థుల జాబితాపై కసరత్తు ప్రారంభించింది. ఇక జనసేన కూడా ఒకవైపు అభ్యర్థుల జాబితా మరోవైపు జనాల్లోకి వెళ్లడంపై దృష్టి సారించింది. తమ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును జనాల్లోకి తీసుకెళ్లే పనిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసింది. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్లాన్‌ను జనసేన సిద్దం చేసింది. గాజు గ్లాసు గుర్తును జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆసక్తిరమైన మార్గాన్ని ఎంచుకుంది.
ఉచితంగా టీ పంపిణీ..
జనాలకు పొద్దున లేచి లేవగానే టీ, కాఫీ పడనిదే కాలు కదలడం చాలా కష్టమైపోతుంది. ఎప్పటి నుంచో ఇది ఆనవాయితీగా మారిపోయింది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న జనసేన.. ఉచిత టీ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా టీ అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్తలు ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నారు. ప్రమోషన్ ట్రిక్ అయితే అదిరిపోయింది. ఉచితంగా టీ ప్రజలకు అందించడం ద్వారా జనాలను తమ వైపు తిప్పుకోవడంతో పాటు గాజు గ్లాసును సైతం జనాల్లోకి తీసుకెళుతున్నారు.
పదేళ్లు దాటుతున్నా జనాల్లోకి వెళ్లలేదు..
ఒక దెబ్బకు రెండు పిట్టలన్నమాట. అయితే ఇలా జనసేన ఎన్నికల ప్రచారం నేడు కొత్తేమీ కాదు.. 2019 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసింది. అయితే అప్పుడు వర్కవుట్ కాలేదు. కానీ ఈసారి పక్కాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. టీడీపీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కాబట్టి గుర్తు జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఇక వైసీపీ గుర్తు సైతం అంతే బలంగా జనాల్లోకి వెళ్లింది. అయితే గాజు గ్లాసు మాత్రం ఎందుకోగానీ పదేళ్లు దాటుతున్నా అంతలా జనాల్లోకి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఈసారైనా తీసుకెళ్లాలనే ధ్యేయంతో వైసీపీ నేతలు ఉచిత టీ పంపిణీ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. మరి ఇది ఎంత మేర సత్ఫలితాన్నిస్తుందో చూడాలి.