జగనన్న వదిలిన బాణంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల.. ఇప్పుడు యూ టర్న్ తీసుకుని జగనన్నకే ఎదురెళ్లింది. రాజకీయాల్లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. షర్మిల ఏ పక్షాన ఉంటే ఎదుటి పక్షానికి మూడినట్టే. ఇది ప్రతి ఎన్నికల్లోనూ స్పష్టమవుతూ వచ్చింది. షర్మిల రాజకీయంగా స్టెప్ తీసుకున్న ప్రతిసారి కూడా అధికార పక్షానికి శాపంగా.. ప్రతిపక్షానికి వరంలా మారుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత షర్మిల తన అన్న జగన్ కోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్న జైల్లో ఉంటే ఊరూరు పాదయాత్ర చేశారు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండేది. ఆ తరుణంలో టీడీపీని ఓడించి తన అన్నను అధికారంలోకి తీసుకొచ్చే వరకూ ఆమె విశ్రమించలేదు.
కుప్పకూలిన ఉద్యమ పార్టీ..
అంటే షర్మిల ఎంట్రీతో అధికారంలో ఉన్న టీడీపీ విపక్షంలోకి.. విపక్షంలో ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత అన్న నుంచి విడిపోయి తన ప్రస్థానాన్ని తెలంగాణకు మళ్లించారు. వైఎస్సార్‌టీపీని స్థాపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆయనను అధికారంలో నుంచి దించడమే తన ప్రథమ ధ్యేయమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వైపు నిలిచారు. అంతే, దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ కుప్పకూలింది. బీఆర్ఎస్ ఓటమిపాలై.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దెబ్బకు ఆమె గోల్డెన్ లెగ్‌లా మారిపోయారు. ఇక ఇప్పుడు తన పార్టీలో కాంగ్రెస్‌లో పూర్తిగా విలీనం చేసి ఏపీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
ఈసారి అధికారం నుంచి దింపడానికి..
అంటే ఏపీలో అధికారపక్షానికి మూడినట్టేనని టాక్ మొదలైంది. జగన్ ప్రతిసారీ దేవుడి స్క్రిప్ట్ అని చెబుతూ ఉంటారు. నిజంగానే ఇదంతా దేవుడి స్క్రిప్టేమో కానీ షర్మిల మాత్రం ఇప్పుుడు ఏపీలోని ప్రతిపక్షానికి దేవతలా కనిపిస్తున్నారు. మరోసారి షర్మిల సెంటిమెంటు కానీ వర్కవుట్ అయ్యిందో జగన్ తన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సిందేననడంలో సందేహం లేదు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తుందనడంలో కూడా ఎలాంటి సందేహమూ లేదు. దేవుడి స్క్రిప్ట్‌లో భాగంగా గతంలో షర్మిల తన అన్నను సీఎంను చేయడానికి ఎంత కష్టపడ్డారో.. ఈసారి అధికారం నుంచి దింపడానికి కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది. నిస్సందేహంగా కష్టపడతారు కూడా. ఇక చూడాలి షర్మిల సెంటిమెంట్ ఈసారి ఎంత మేర వర్కవుట్ అవుతుందో..