గొప్ప గొప్ప పేర్లన్నీ వైసీపీకే దొరుకుతాయి. సినిమా వాళ్లంతా టైటిల్స్ కోసం నానా తంటాలు పడుతుంటారు. వైసీపీ అధినేత జగన్ మాత్రం టైటిల్స్ ఇట్టే పట్టుకొచ్చేస్తారు. ప్రస్తుతం ఆయన పూరించిన ఎన్నికల శంఖారావానికి సైతం ఒక టైటిల్‌ను పెట్టారు. అదే ‘సిద్ధం’. భీమిలి వేదికగా ఈ సిద్ధం పేరిట సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ సీఎం జగన్ ప్రసంగం వినాలి.. ఓ రేంజ్ అంతే. సీఎం జగన్ ఏ సభ అయినా సరే.. ముందుగా అక్కచెల్లెమ్మలతో మొదలు పెడతారు. ఇంట్లో చెల్లెమ్మను దేఖరు.. పైగా ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తారు. ఇది వదిలేస్తే.. నెక్ట్స్ తనను తాను పొగుడుకుంటారు. అది చేశాను.. ఇది చేశాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఎక్కడికో తీసుకెళ్లానని చెబుతారు.
జగన్ మంచి చేశారా?
ఆ తరువాత ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తారు. ఇక భీమిలి సభలో అయితే తాను ప్రతిపక్షాలు రూపొందించిన పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి అభిమన్యుడిని కానని.. అర్జునుడినని తెలిపారు. అబ్బబ్బా.. ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి. ఇంతకీ కౌరవులు రూపొందించిన పద్మవ్యూహం అభిమన్యుడికోసమైతే.. అర్జునుడు ఎందుకెళ్లి చిక్కుకుంటాడు? ఏదో అభినవ అభిమన్యుడిని చీల్చుకుని వచ్చేస్తా అంటే కాస్త డైలాగ్‌కి వెయిట్ ఉంటుంది. పోనీ జగన్ తనను తాను పాండవ కుమారుడిగా చిత్రీకరించుకున్నాడు కాబట్టి.. పాండవులు అన్నీ మంచి పనులే చేశారు. మరి జగన్ చేశారా? పాండవులు నమ్మిన ప్రజానీకానికి ఒక కొత్త నగరాన్నే నిర్మించి ఇచ్చారు. మరి జగనో ప్రభుత్వాన్ని ప్రారంభించడమే జనం సమస్యలు చెప్పుకోవడానికని నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించారు కదా..
కృష్ణుడిని రానివ్వకుండా కోటలు నిర్మించుకోలేదే?
పోనీ అది కూడా వదిలేద్దాం.. తనొక అర్జునుడు.. తనకు కృష్ణుడు మాదిరిగా జనం అండగా ఉన్నారని అన్నారు. మరి అర్జునుడు శ్రీకృష్ణుడిని దగ్గరకు రానివ్వకుండా ఏనాడూ కోటలు నిర్మించుకోలేదే? కనీసం ఎమ్మెల్యేలకు సైతం ఆయన ప్యాలెస్‌లోకి అనుమతి లేదుగా.. ధర్మరాజు మాటకు కట్టుబడి అర్జునుడు రాజభోగాలను వదులుకున్నాడు. కానీ జగన్.. తన రాజభోగాలకు ఎక్కడ అడ్డొస్తారోనని కన్నతల్లిని.. తోడబుట్టిన చెల్లిని రోడ్డు పాలు చేశారు కదా. అర్జునుడితో తనను తాను పోల్చుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి. అవేమీ లేకుండా అడ్డదిడ్డంగా తనను తాను అర్జునుడితోనో.. ధర్మరాజుతోనో పోల్చుకుంటూ పోతే సోషల్ మీడియా ఉండనే ఉంది కదా.. ఏకి పారేస్తుంది.