ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు తెరదీసింది. గెలుపునకు దాదాపు అన్ని దార్లూ మూసుకుపోయిన తరుణంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే తమకు అనుకూలురైన అధికారులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పంపించేశారు. తాజాగా 30 మంది ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. కీలు బొమ్మల్లాంటి అధికారులను ఏరి కోరి మరీ ఎంపిక చేసి వారిని కీలక స్థానాల్లో నియమించింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును లాక్ చేయడం కోసం ఎస్పీ రిశాంత్ రెడ్డిని కౌంటర్ ఇంటెలిజెన్స్(ఉగ్రవాదుల ఏరివేత)కు బదిలీ చేసి.. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక విభాగం ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మొత్తానికి తాము చెప్పినట్టు నడుచుకునే అధికారిని జిల్లా వదిలిపోకుండా అయితే చూసుకుంది.
వైసీపీ కోసం ఏమైనా చేస్తారు..
అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీగా.. కృష్ణా జిల్లాకు చెందిన ఎస్పీ పి.జాషువాను నియమించింది. ఈయన గారి చరిత్ర మామూలుది కాదండోయ్.. వైసీపీ నేతల కోసం ఏమైనా చేసేస్తారు. ప్రభుత్వం తనకు కేటాయించిన వాహనంలో వైసీపీ నేతలను బహిరంగంగానే తిప్పుతూ ఉంటారు. ఇక కర్నూలు డీఐజీగా విజయరావును నియమించింది. కడప కూడా ఈయన పరిధిలోకే వస్తుంది. ఈయన కూడా వైసీపీ కోసం ఏమైనా చేస్తారు. కర్నూలు, కడప జిల్లాలు ఈయన కింద ఉన్నందున ఆ పార్టీకైతే ఈ రెండు జిల్లాల్లో అడ్డూ అదుపు ఉండదనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న ఫకీరప్పను విశాఖ సిటీకి బదిలీ చేసింది. ఈయన చరిత్ర మహా అద్భుతం.. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కేసు నమోదు చేశారు.
అధికారులను అడ్డుపెట్టుకుని..
ఇక ఇప్పటికే ఒక విడత బదిలీ ప్రక్రియ అయితే పూర్తైంది. దీంతో ఆగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. నేడు మరికొందరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేసింది. ఎక్కడికక్కడ అనుకూలురైన అధికారులను బదిలీ చేసేసింది. ఎన్నికల షెడ్యూల్ వస్తే బదిలీలు సాధ్యపడవని నోటిఫికేషన్ రావడానికి ముందే తమ పల్లకిని మోసే అధికారులను అనుకున్న స్థానాలకు పంపించి వేసింది. ఇక ఇప్పుడు వైసీపీ గేమ్ మొదలు పెట్టనుంది. ఇప్పటి వరకూ ఎన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నా కూడా అధికారులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ యత్నిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నేటి బదిలీల్లో పల్నాడు, తిరుపతి, గుంటూరు అర్బన్, ప్రకాశం, బాపట్ల, విజయనగరం జిల్లాల ఎస్పీలు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.