ఆంధ్రప్రదేశ్ ఎన్నికలంటే చాలు.. వైసీపీ ఏదో ఒక సినిమా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేత డైరెక్ట్ చేయించి వదులుతుంది. ఆ సినిమాలో ఏపీ సీఎం జగన్.. జనం కోసమే పుట్టిన ఏసయ్యగానూ.. మిగిలిన విపక్ష నేతలంతా రాక్షసులుగానూ ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రతిపక్షాల కారణంగానే ఎన్నో ఇబ్బందులు పడుతూనే జనాలకు జగన్ సేవలు అందిస్తూ ఉంటారు. ఆయనొక సౌమ్యుడిగానూ.. జాలి, దయ వంటి లక్షణాలన్నీ మెండుగా ఉన్న ఉత్తముడిగానూ సినిమాలో చూపిస్తాడు ఆర్జీవీ. ఇక ఈసారి ఎన్నికల్లోనూ వైసీపీ ఒక సినిమాను తీసి జనాల మీదకి వదలబోతోంది. దాని పేరే యాత్ర.
రాజధాని ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా..
ఇక ఈసారి దర్శకుడు మహి వి రాఘవ సైతం వైసీపీ కోసం మరో సినిమాను సిద్ధం చేశారు. అయితే అనూహ్యంగా ఈసారి వైసీపీకి కౌంటర్‌గా భాను శంకర్ దర్శకత్వంలో రాజధాని ఫైల్స్ మూవీ తెర మీదకు వచ్చింది. ఇక ఈ చిత్రం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కథ ఆధారంగా రూపొందింది. ముఖ్యంగా అమరావతిని అయిరావతిగా మార్చడం.. అలాగే రాజధాని ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అమరావతి పేరుని అయిరావతిగా మార్చడం.. ఆంధ్రప్రదేశ్ పేరుని అరుణప్రదేశ్‌గా మార్పు చేసి న్యాయపరమైన అడ్డంకులకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడ్డారని సమాచారం.
ఏపీ ప్రభుత్వాన్ని చీల్చి చండాడిన ట్రైలర్..
సీనియర్ నటులు వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్‌లతో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా మరో ఛాన్స్ తీసుకోవాలంటే.. ఫిబ్రవరి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. ఈ రాజధాని ఫైల్స్ చిత్రం.. ‘యాత్ర’కు అడ్డుకట్ట వేస్తుందా? లేదా? అనేది. అయితే రాజధాని ఫైల్స్ ట్రైలర్ అయితే వైసీపీ ప్రభుత్వంతో పాటు దాని విధానాన్ని చీల్చి చండాడినట్టుగా ఉంది. అలాగే గుడివాడ కేసినో వంటి చాలా ఆసక్తికర అంశాలున్నాయి. అయితే నిజానికి ఆర్జీవీ ఇటీవలి కాలంలో దర్శకుడిగా సక్సెస్ అయిన దాఖలాలే లేవు. ఇక భాను శంకర్ అనే దర్శకుడు ఉన్నట్టుగా కూడా ఇండస్ట్రీలో తెలియదు. అయితే ఈ సినిమాతో తన టాలెంట్‌ను తెలుగు రాష్ట్రాలకు చూపించాలన్న తపన అయితే ఉండొచ్చు. మరి ఆ తపన సక్సెస్ వైపు నడిపించి యాత్రకు అడ్డుకట్ట వేస్తుందా? లేదా? అనేది తెలియాలి. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో సినిమాలైతే ప్రచారాస్త్రాలుగా మారబోతున్నాయనడంలో సందేహం లేదు.